వానాకాలం ముగియనున్న నేపథ్యంలో రాబోయే యాసంగి సీజన్ సన్నద్ధత, విత్తన సేకరణ, లభ్యత వంటి అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో యాసంగి విత్తన సేకరణపై వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సాగు నీటి ప్రాజెక్టులు నిండాయి... చెరువులు అలుగు పారుతున్నాయని, రైతులకు సాగు నీరు అందుబాటులో ఉందన్నారు.
గత యాసంగి కన్నా ఈ ఏడాది రబీ సీజన్‌లో సాగు పెద్ద ఎత్తున పెరుగబోతుందన్నారు. వేరుశనగ, పప్పుశనగ, వరి విత్తనాల సేకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తన సరఫరాలో రైతులను ఎలాంటి సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు మాసంలో యాసంగి విత్తనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పారు. ప్రస్తుతం 50 వేల క్వింటాళ్ల వేరుశనగ, 73 వేల క్వింటాళ్ల పప్పుశనగ విత్తనం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద సిద్ధంగా ఉన్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, ఎండీ డాక్టర్ కె.కేశవులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్.. రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక