ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. రాబోయే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుపై హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 15 జిల్లాలలో 8 కంపెనీలకు 4 లక్షల 61 వేల 300 ఎకరాలు కేటాయించి ఉద్యానశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒప్పందం ప్రకారం కంపెనీలు సకాలంలో ఆయిల్ పామ్ పంటలను సాగులోకి తేవాలని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆయిల్ పామ్ సాగుకు అనువైన నేలలు కలిగి ఉన్న రైతులను ఉద్యానశాఖ సహకారంతో కంపెనీలు ఎంపిక చేసుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి సమావేశాలకు స్వయంగా హాజరవుతానని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ నిర్మల, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రామి రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, నాబార్డు , ఎస్ఎల్బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.