ఏపీ సచివాలయంలో సినీ నిర్మాతలు, థియేటర్ యజమానులతో మంత్రి పేర్ని నాని (Perni Nani on Online Tickets) భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, సినీ నిర్మాతలు దిల్ రాజు, సి.కల్యాణ్, ఆన్‌లైన్ టిక్కెట్ల వ్యవహారంపై సినీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశం ఫలప్రదంగా ముగిసిందని... భేటీలో పాల్గొన్న (Meeting on Online Tickets) నిర్మాతలు తెలిపారు. తమ వినతుల పట్ల మంత్రి పేర్ని నాని, అధికారులు సానుకూలంగా స్పందించారని.. తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. బుక్ మై షో యాప్ తరహాలోనే ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్లు విక్రయించనుందని వివరించారు. చిత్ర పరిశ్రమ విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి పేర్నినాని వివరాలను వెల్లడించారు.
"సినీ పెద్దలతో అనేక విషయాలు చర్చించాం. సినీ పెద్దలు చెప్పిన సమస్యలన్నీ నమోదు చేసుకున్నాం. మరిన్ని విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి చెప్పాం. టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మాలనే కేంద్రం చర్యలను స్టడీ చేశాం. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలు గుర్తించాం. చిత్ర నిర్మాణంలో నిర్మాతలు కోరుతున్న వసతులు తెలుసుకున్నాం. ఆన్‌లైన్ విధానంలో టికెట్ విక్రయాలకు అంతా ఆమోదం తెలిపారు. సగటు సినీ ప్రేక్షకులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలను చేపడతాం. త్వరలోనే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదం అందుతుంది. చట్టాలకు లోబడే ప్రభుత్వం నడుచుకుంటోంది. బెనిఫిట్ షోల గురించి ఇవాళ ఎవరూ అడగలేదు. ఎవరు విజ్ఞప్తి చేసినా సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారు."
-- పేర్ని నాని, మంత్రి
ప్రభుత్వం నుంచి భరోసా లభించింది: నిర్మాత సి. కల్యాణ్
ప్రభుత్వం నుంచి భరోసా లభించిందని నిర్మాత సి.కల్యాణ్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ కావాలని తామే అడిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు సినీ పరిశ్రమ సంతోషంగా ఉందన్నారు.
సమస్యలు పరిష్కారానికి హామీ..
ఆన్‌లైన్ టికెటింగ్ గతంలో ఆప్షన్‌గా ఉండేదని మరో నిర్మాత ఆదిశేషగిరిరావు అన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌ను కంపల్సరీ చేయాలని తామే కోరినట్లు వెల్లడించారు. థియేటర్ యజమానుల సమస్యలతో పాటు, సినీ పరిశ్రమకు మేలు చేసేందుకు సహకరిస్తామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
బుక్ మై షో తరహాలోనే...
సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని నిర్మాత డీఎన్‌వీ ప్రసాద్ అన్నారు. బుక్ మై షో తరహాలోనే ప్రజలు ఆన్‌లైన్ టికెట్లు కొంటారని వెల్లడించారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లు పెరిగాయని తెలిపారు.
ఇదీ చదవండి: ఇండస్ట్రీని ఆదుకోండి.. తెలుగు ప్రభుత్వాలకు చిరు విజ్ఞప్తి