హైదరాబాద్‌కు రెండ్రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథక ప్రారంభం కార్యక్రమంలో భాగంగా రహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ లాంఛనంగా మొదలుపెట్టారు. తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని గుర్తు చేసుకున్న కేటీఆర్... ప్రస్తుతం ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే తెరాస ధ్యేయమని ఉద్ఘాటించారు.
బస్తీల్లోని పేదల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని మంత్రి తెలిపారు. బలహీనవర్గాల పిల్లలను విదేశాలకు పంపి చదివిస్తున్నామన్నారు. డిసెంబరు నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై రూ.500 కోట్ల భారం పడినా పేదల కోసం భరిస్తున్నామన్నారు. ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లులు ఇచ్చామని వివరించారు. 2048 వరకు హైదరాబాద్‌లో తాగునీటి కొరత లేనివిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు బాధలు తొలగిపోయాయని పేర్కొన్నారు.