జీహెచ్ఎంసీలో వరదలు పాలకుల కళ్లు తెరిపించాయి. దీంతో హైదరాబాద్ చెరువులకు మహర్దశ వచ్చింది. నగరానికి బాహ్యవలయ రహదారి లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ ఏడాది భారీ వర్షాలకు పెద్దఎత్తున కాలనీలు ముంపు గురి కావడంతో చెరువుల సంరక్షణ, నిర్వహణపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
భాగ్యనగరానికి నగరానికి చుట్టూ ఉన్న బాహ్యవలయ రహదారి లోపల ఉన్న జలవనరులు, నాలాలపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. బాహ్యవలయ రహదారి లోపల ఉన్న చెరువుల సంరక్షణ నిర్వహణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ విభాగానికి సాగునీటి శాఖ చీఫ్ ఇంజినీర్ ఒకరు నాయకత్వం వహిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాల వలన పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. చుట్టూ ఉన్న ఇతర పురపాలక పట్టణాల్లోనూ వరద ప్రభావం చూపడంతో సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇరిగేషన్, జలమండలి, హెచ్ఎండీఏ, రెవెన్యూ యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, నాలాలు అన్నింటిపైనా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చెరువుల నీటి మట్టాలతో పాటు వాటి వరద ప్రభావ పరిస్థితులు మరియు చెరువుల గట్ల సామర్థ్యాన్ని తెలుసుకునే విధంగా ఈ అధ్యయనం జరగాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాగునీటి శాఖతో కలిసి ఈ అధ్యయనం జరపాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు చెరువులకు సంబంధించిన ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలోని వాటర్ బాడీస్పైన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ఇందులో జలమండలి, హెచ్ఎండీఏ, రెవెన్యూ, సాగునీటి శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యదళం ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకునేలా పని చేస్తుందన్నారు. సాగునీటి శాఖ రిజర్వాయర్లలో వరద ప్రవాహాన్ని నియంత్రించిన తీరుగానే, ఎప్పటికప్పుడు కురిసే వర్షాల వల్ల వచ్చే వరదను అంచనా వేస్తుందన్నారు. చెరువుల్లో నీటి నిల్వలను, వాటర్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. చెరువులలో అక్రమంగా భవనాలు నిర్మిస్తే, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని కూల్చివేసే అధికారం పురపాలక శాఖకు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.