"హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాసను నిలువరించేందుకు భాజపా, కాంగ్రెస్‌లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటల రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో గోల్కొండ రిసార్ట్స్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక దశలో పార్టీని త్యాగం చేస్తామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ చేతుల్లోనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని అందరూ విన్నవించడంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుపరిపాలనతో దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఏకకాలంలో ప్రభుత్వాన్ని, పార్టీని అద్భుతంగా నడుపుతున్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష. ఎవరితోనైనా తెరాస రాజీపడకుండా పోరాడుతుంది. రాష్ట్ర ప్రజలకే మేం శిరసు వంచుతాం తప్ప గుజరాత్‌కు గులాములం కాదు.. దిల్లీకి బానిసలం కాదు." - కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
- తెరాస 20 ఏళ్ల ప్రస్థానం ఎలా సాగింది?
తెరాస ఆవిర్భావం ఒక సంచలనం. ప్రజల సుదీర్ఘ కాంక్ష సాధనను కేసీఆర్ భుజానికెత్తుకున్నారు. ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి లక్ష్యాన్ని సాధించారు. రాజకీయ పార్టీగానూ తెరాస సత్తా చాటింది. మేం చేసినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏ పార్టీ చేయలేదు. పలు రాష్ట్రాలు, కేంద్రం మా విధానాలను అనుసరిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని విజయాలే లక్ష్యంగా పార్టీ ప్లీనరీ, విజయగర్జన సభలను నిర్వహిస్తున్నాం.
- పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంది?
గ్రామ, బస్తీ, మండల, డివిజన్ కమిటీల ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబరు 15న లక్షల మందితో విజయగర్జన సభను నిర్వహిస్తాం. డీఎంకే తరహాలో పార్టీ పటిష్ఠం చేసేందుకు ఆ రాష్ట్రంలో పర్యటిస్తాం. మిగిలిన రాష్ట్రాల్లో బలమైన పార్టీలను అధ్యయనం చేస్తాం. రాబోయే ఎన్నికల్లోపే సంస్థాగతంగా బలపడుతాం.
- పార్టీ శ్రేణుల పనితీరు ఎలా ఉంది?
తెలుగుదేశం పార్టీ తర్వాత అంతగా నిలదొక్కుకున్నది తెరాసయే. రాజకీయంగా ఎన్టీఆర్ ఒక తరాన్ని తెస్తే... మరోతరాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్‌దే. తెరాసలో రత్నాల్లాంటి నేతలున్నారు. పార్టీకి ప్రాణమిచ్చే కార్యకర్తలున్నారు. అంతా క్రమశిక్షణతో నడిస్తే పార్టీకి మేలు.
- పార్టీ, ప్రభుత్వాన్ని సమపాళ్లలో ఎలా నడుపుతారు?
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సమర్థ యంత్రాంగం ఉంది. పార్టీపరంగానూ వీటి అమలులో భాగస్వామ్యం ఉండాలి. నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు అభివృద్ధి పనుల్లో తాము పాలుపంచుకుంటామని తెలిపారు. పట్టణప్రగతి, గ్రామప్రగతి మాదిరే వ్యవసాయ ప్రగతిని ప్రారంభించాలని, రైతుబంధు చెక్కులను ఇచ్చే అవకాశం కల్పించాలని, వివిధ పథకాల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని కోరారు. కచ్చితంగా వారికి అవకాశం కల్పిస్తాం. సీనియర్ నాయకులకు త్వరలో కార్పొరేషన్లు, ఇతర నియమిత పదవులను ఇస్తాం.
- రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌లకు కొత్త అధ్యక్షులు వచ్చాక తెరాస రాజకీయ కార్యకలాపాలు పెరిగాయంటున్నారు?
ఆ పార్టీల కొత్త అధ్యక్షులు రావడంతో వారి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది. గాంధీభవన్‌లో గాడ్సే దూరాడు. భాజపాతో కుమ్మక్కై హుజూరాబాద్‌లో అనామక అభ్యర్థిని నిలిపారు. కాంగ్రెస్‌లో చేరతానన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈటలకు ఓటేయాలంటున్నారు. రేవంత్ సైతం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడం లేదు. అన్నం పెట్టి, రాజకీయంగా జన్మనిచ్చిన కేసీఆర్‌ను, తెరాసను బొంద పెడతామని, గోరీ కడతామని రాజేందర్ మాట్లాడటం దారుణం. ఎన్నికల తర్వాత ఏడాదికి ఈటల కాంగ్రెస్‌లో చేరతారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మా చిట్టా బయటపెడతామంటున్నారు. ఆయనేమైనా చిత్రగుప్తుడా? పైన యమధర్మరాజు ఉన్నారా? భాజపా ఈడీని, సీబీఐని తమ కక్షసాధింపునకు వాడుకుంటోంది. వాటికి ఇక్కడ భయపడేవారెవరూ లేరు. ఏ విచారణకైనా సిద్ధమే ఎక్కడైనా సీఎంలను దూషించే ధోరణి సరికాదు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి.
- హుజూరాబాద్‌లో సీఎం ప్రచారం ఎప్పుడు?
ఇంకా ఖరారు కాలేదు. మరో నాలుగైదు రోజుల సమయం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికల్లో తమ పరిధి దాటి వ్యవహరిస్తోంది. దళితబంధు కొనసాగుతున్న కార్యక్రమమైనా నిలిపివేయడం దారుణం. పొరుగు జిల్లాల్లో సభలు పెట్టవద్దనడం సమంజసం కాదు. ఈసీ అనుకుంటే పొరుగు రాష్ట్రాల్లో సైతం ప్రచారాన్ని నిషేధించేలా ఉంది.
ఇదీ చూడండి: