మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును, మానవత్వాన్ని చాటుకున్నారు. దిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూ.. లాక్డౌన్ పరిస్థితుల వేళ ఆత్మహత్య చేసుకున్న షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
బాధలో ఉన్న కుటుంబానికి అండగా..
ఆశలన్నీ కూతురుపైనే పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. తన చదువు కోసం చేసిన అప్పులతో పేదరికంలో కూరుకుపోయారని.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన కేటీఆర్... కూతురను పోగొట్టుకొని మానసిక వేదనలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఐశ్వర్య కుటుంబసభ్యులను ప్రగతి భవన్‌కు ఆహ్వానించి రెండున్నర లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ పరిస్థితులు, బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి... షాద్‌నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ఉద్వోగానికి లోనైన కుటుంబం...
పేదరికాన్ని జయించి దేశంలోనే ప్రముఖ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న కూతురిని కోల్పోవడం తీరని లోటని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. కూతురుని కోల్పోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేని తమ కుటుంబానికి మంత్రి కేటీఆర్ చేసిన సహాయం గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని ఐశ్వర్య తల్లిదండ్రులు పేర్కొన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటామని ఉద్వేగానికి లోనయ్యారు.
కుటుంబాన్ని కష్టపెట్టలేక.. లక్ష్యానికి దూరమవలేక..
దిల్లీలోని ప్రముఖ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ... సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐశ్వర్యరెడ్డికి కరోనా వేళ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పేదరికంలో ఉన్న కుటుంబ నేపథ్యంలో.. కళాశాల, హాస్టల్ ఫీజులు, ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన ల్యాప్‌టాప్ కొనుగోలు చేయలేని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. ఓవైపు పేదరికంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాన్ని మరింత కష్టపెట్టలేక... ఎంచుకున్న లక్ష్యం, ఉన్నత చదువుకు దూరమవటం ఇష్టం లేక... తీవ్ర మనస్తాపానికి గురైంది. ఏం చేయాలో పాలుపోక... బలహీనమైన క్షణంలో ఐశ్వర్యరెడ్డి ఆత్మహత్య చేసుకుంది.