KTR Comments: 50 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని అవమానించినందుకు రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న కేటీఆర్.. ప్రధాని మోదీతో పాటు, భాజపా, కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ చేసింది శూన్యమని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రానికి ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉందన్న కేటీఆర్.. దేశంలో మోదీ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. గుజరాత్ కంటే అభివృద్ధి చెందుతున్నామని మోదీకి కడుపుమంటగా ఉందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
వాళ్లను ఓ కంట కనిపెట్టాలి..
"గుజరాత్ కంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీకి కడుపుమంట. పచ్చని తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్నారు. ఎనిమిదేళ్ల కింద మాట్లాడిన పనికమాలిన మాటలే మోదీ ఇప్పుడు మాట్లాడారు. విశ్వాసం నింపాల్సిన చోట మోదీ విద్వేషం నింపారు. దశాబ్దాల పోరాటాన్ని ప్రధానమంత్రి కించ పరిచారు. తెలంగాణకు ఇస్తానన్న కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదు. మోదీ ఎనిమిదేళ్లలో తెలంగాణకు చేసింది శూన్యం. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉంది. తెలంగాణలోని ఏడు మండలాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు.. మోదీ రాజ్యాంగమే అమలవుతోంది. అన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని మోదీ పాలిస్తున్నారు. తెలంగాణపై విషం చిమ్మే భాజపాను మేధావులు ఓ కంట కనిపెట్టాలి." - కేటీఆర్, మంత్రి
రామోజీరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు..
దేశవ్యాప్తంగా పల్లె ప్రగతిలో ఏడు గ్రామాలు మన తెలంగాణలోనే ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 40లక్షల మందికి 10వేల కోట్లు ఫించన్లు వస్తున్నాయని... మిగిలిపోయిన వాళ్లకు ఏప్రిల్ నుంచి ఆసరా పింఛన్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయానికి రామోజీ ఫౌండేషన్ నిధులు కేటాయించిందని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆర్డీవో కార్యాలయానికి నిధులు కేటాయించిన రామోజీ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ ఛైర్మన్ తీగల అనితారెడ్డి, సాయిచంద్, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: