Jagadish Reddy fire on Rajagopal reddy: అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలోకి వెళ్లినట్లు బహిర్గతమైందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన.. మునుగోడు భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజగోపాల్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్ముకున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి కుట్రతోనే మునుగోడు ఎన్నికను తెచ్చారని ధ్వజమెత్తారు. భాజపా అభ్యర్థికి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలవుతాయని.. మోటార్లకు మీటర్లు వస్తాయని అన్నారు. మునుగోడులో తెరాస అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. తెరాసకు కాంగ్రెస్ పార్టీనే పోటీ అని స్పష్టం చేశారు.
'మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్ముకున్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి భాజపాలోకి వెళ్లినట్లు బహిర్గతమైంది. ఆర్నెళ్ల క్రితం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చినట్లు నిన్న రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి.. త్యాగాలు చేశాననటం హాస్యాస్పదం. ఏ కారణం వల్ల మునుగోడు ఉపఎన్నిక వచ్చిందో రాజగోపాల్‌రెడ్డి చెప్పాలి. మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా?'- జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: