Minister jagadish reddy comments: రాష్ట్ర రైతులను కేంద్ర ప్రభుత్వం మోసాగించే ప్రయత్నం చేస్తుందే తప్ప.. మేలు చేసిందేమీ లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీకి వెళ్లే క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి... భాజపా నేతలపై మండిపడ్డారు. తెలంగాణలోనే వరి ధాన్యం ఎందుకు పెరిగింది..? గుజరాత్లో ఎందుకు పెరగలేదు..? అని భాజపా నేతలను మంత్రి ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంగా మాట్లాడాల్సింది ఎంపీలు కాదు.. కేంద్ర మంత్రులని హితవు పలికారు. తెలంగాణ నుంచి వడ్లు ఎన్ని కొంటారో కేంద్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్టంతో ఎవరికి లాభమో చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ చట్టాలపై కూడా అన్ని విషయాలు బయట పెడుతామన్నారు.
కొనుగోళ్లపై పార్లమెంట్లో చర్చ పెట్టండి..
Paddy procurement in telangana: "విద్యుత్ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేది మీరు కాదా..? వ్యవసాయ బోర్లు, బావులకు మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పేది మీరు కాదా..? మీ విద్యుత్ చట్టంతో ఎవరికి లాభమో చెప్పాలి..? కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు.. రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధ్యతాయుతంగా మాట్లాడలేదు. వరి కొనుగోళ్లపై పార్లమెంట్లో చర్చ పెట్టండి. మా సభ్యులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ నుంచి వడ్లు ఎన్ని కొంటారో చెప్పడం లేదు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత కేంద్రానిది.. దానిపై కాకుండా అడ్డదిడ్డంగా ఏదేదో మాట్లాడుతున్నారు. రాష్ట్ర రైతులకు ఏం చెప్పదల్చుకున్నారో.. అది చెప్పాల్సింది ప్రధాని నరేంద్ర మోదీ. భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఎందుకు లేదు..? 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు..? రాష్ట్ర భాజపా అధ్యక్షుడి తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది." - జగదీశ్‌రెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: