Jagadeesh reddy Comments: భాజపా నాయకులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి పచ్చి అబద్దాలు చెబుతున్నారని.. ఆయన్ను చూస్తే జాలేస్తోందన్నారు. కేంద్రం ఆర్థిక సాయానికి విద్యుత్ సంస్కరణతో ముడిపెట్టిందని మంత్రి దుయ్యబట్టారు. విజ్ఞత ఉంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు. నిప్పులాంటి కేసీఆర్‌ను భాజపా నేతలు ముట్టుకుంటే మసైపోతారని మంత్రి హెచ్చరించారు. కేసీఆర్‌పై ఆరోపణలు చేసి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమున్నట్టు నోరుపారేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్వాతంత్య్రం కోసం పోరాడి గతించిన గొప్ప నాయకుల గురించి కూడా దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణ చేస్తే పూర్తి మార్కులంటా..
"కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏమైనా నిధులు తెచ్చారా..? మిషన్ కాకతీయ అద్భుతమైన పథకమని నీతి ఆయోగ్ చెప్పింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ చెప్పినా... కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర హక్కుల గురించి భాజపా నేతలు ఎందుకు అడగరు. తెలంగాణ ఏర్పాటును కేంద్రంలోని భాజపా అవమానించింది. మోదీ, అమిత్ షా చేసిన అవమానం గురించి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు. పరిపక్వత ఉన్న కిషన్‌రెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. విద్యుత్ సంస్కరణలను దొడ్డిదారిన అమలు చేస్తున్నారు. విద్యుత్ సంస్కరణలపై చట్టం చేయకుండా పాలసీ విధానంగా అమలు చేస్తున్నారు. విద్యుత్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తే పూర్తి మార్కులిస్తామని కేంద్రం చెప్తోంది. అన్ని మోటార్లకు మీటర్లు పెడితే నిధులిస్తామని కేంద్రం చెప్తోంది. చట్టం చేస్తే రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని ఉత్తర్వులతో అమలు చేస్తున్నారు. మీటర్లు పెట్టనందుకే మమ్మల్ని నిరోధిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఒక్కరోజైనా ఉన్నారా?. భాజపా నేతల మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. గతించిన వారి గురించి కూడా దారుణంగా మాట్లాడుతున్నారు." - జగదీశ్‌రెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: