కరోనాను అడ్డుకోవాలి గానీ.. బాధితులను కాదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కొవిడ్ కట్టడికి కృషిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేటలో జితో కొవిడ్ కేర్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మహావీర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో పేదల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మహావీర్, జితో బృందానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వస్తే చనిపోతారనే అపోహ సరికాదని... రాష్ట్రంలో 99 శాతం మంది కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని హరీశ్‌రావు వివరించారు.
కరోనా వచ్చినంతమాత్రాన ఎవరూ చనిపోరు. ఇతర జబ్బులున్నవారు, లక్షణాలు కనిపించినా.. వెంటనే ఆస్పత్రికి వెళ్లనివారికి మాత్రమే పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. సమాజంలో కొంత మంది.. కరోనా బాధితులను గ్రామాల్లోకి రానివ్వకపోవడం, అపార్టుమెంట్లు నుంచి ఖాళీ చేయించడం చేస్తున్నారు. అలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. వైద్యులకు నాదో విజ్ఞప్తి...కరోనా రోగులను మరింత మానవత్వంతో చూడండి. మీరు చెప్పే మంచి మాటలే రోగిని సగం నయం చేస్తాయి.
-హరీశ్ రావు, మంత్రి
ఇవీచూడండి: ఏపీలో మరో 7822 కరోనా కేసులు నమోదు