Harish Rao Letter To Union Minister : రాష్ట్రంలో డిమాండ్‌కి తగినమొత్తంలో కొవిడ్ టీకా డోసులు అందుబాటులో లేవని పేర్కొంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రానికి తక్షణమే 50 లక్షల కొవిషీల్డ్ డోసులు పంపాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో 106 శాతం మొదటి డోస్, 104 శాతం రెండో డోస్ పంపిణీ చేసినట్టు వివరించారు. ఇక 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్లో దేశంలోనే రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు.
ప్రికాషనరీ డోస్ కోసం రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతిరోజు 3 లక్షల డోసులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్ కొరత వల్ల రోజుకు కేవలం 1.5 లక్షల డోసులు మాత్రమే ఇవ్వగలుగుతున్నట్టు కేంద్రానికి వివరించారు. ప్రస్తుత డిమాండ్ మేరకు వ్యాక్సిన్ సరఫరా కావడం లేదన్న మంత్రి.. రాష్ట్రంలో కేవలం 2.7 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే 50 లక్షల కొవిషీల్డ్ డోసులను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి వెల్లడించారు.