తెరాసతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లోని భారతీనగర్‌లో తెరాస అభ్యర్థి సింధు ఆదర్శ్‌రెడ్డి తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. కరోనా వల్ల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని... త్వరలోనే పేదలకు ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇంటింటికి నల్లా పెట్టి తాగునీరు అందించామని... ఇప్పుడు నల్లా బిల్లులు సైతం రద్దు చేస్తున్నామన్నారు. వరద సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని... ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి పరిహారంఅందిస్తామని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే బాధ్యత కేసీఆర్ తీసుకుంటున్నారని వివరించారు. సీఎంతో మాట్లాడి బీహెచ్‌ఈఎల్ విశ్రాంత ఉద్యోగులకు పింఛను ఇప్పిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో రూ.21 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని తెలిపారు. ఉస్మాన్‌నగర్‌లో ఐటీ పార్క్, సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైస్ పార్క్ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. నగరంలో శాంతిభద్రతల సమస్యలు ఉంటే పెట్టుబడులు నిలిచిపోతాయన్నారు. కరోనా, భారీ వర్షాల సమయంలో ప్రజలకు అండగా ఉంది తెరాస మాత్రమేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.