మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రి గంగుల కమలాకర్ బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. పీవీతో తనకు చాలా అనుబంధం ఉందని తెలిపారు. తాను ఇంజినీరింగ్ చదివేటప్పుడు 1984లో ఆయన ఎంపీగా ఉన్నారని.. తనకు ఇంజినీరింగ్ సీటు ఇవ్వాలని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి పీవీ ఓ చిటీ మీద రాసిచ్చారని వెల్లడించారు.
అయితే డబ్బులు కట్టాలని కాలేజీ వారు చెప్పడంతో మళ్లీ పీవీ వద్దకు వెళ్లామని. ఆ సందర్భంలో పీవీ ఓ మాట అన్నారని.. వెనుకబడిన కులాల బిడ్డలు డబ్బులు కట్టలేరు అని పీవీ అన్నారని మంత్రి గుర్తు చేశారు.
ఒక్క రూపాయి కూడా డబ్బు లేకుండా సీటు ఇప్పించారు. అలా పీవీ వల్ల తన ఇంజినీరింగ్ విద్య పూర్తయింది. పీవీ ప్రధాని అయ్యాక ఆయనను కలిశాను. తెలంగాణ బిడ్డ అయిన పీవీకి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ పరిణామం సంతోషించదగ్గ విషయం. - మంత్రి గంగుల
సాగునీటి రంగంలో పీవీ కన్న కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని గంగుల పేర్కొన్నారు. కరీంనగర్ - వరంగల్ రహదారికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌కు గంగుల విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ల వద్దే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్