కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేసుకున్న తొలి రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు. ఒక్క ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ కొరత రావద్దని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. ఆక్సిజన్ పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించామని తెలిపారు. రేపట్నుంచి నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలోనూ కొవిడ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటికే నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 350 పడకలు సిద్ధమైనట్లు తెలిపారు.
ఆక్సిజన్ కొరత లేదు...
రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదన్న మంత్రి... అవసరమైన అన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపుతున్నామన్నారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరమున్నట్లు తెలిపిన మంత్రి... 400 టన్నులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పీఎం కేర్స్ నుంచి 5 ఆక్సిజన్ మిషన్లు వచ్చినట్లు తెలిపారు.
వారంలో 3,010 ఆక్సిజన్ బెడ్లు...
దేశంలో 600 ఐసీయూ బెడ్లు నిర్వహిస్తున్న ఆస్పత్రి గాంధీ ఒక్కటేనని పేర్కొన్నారు. మరో వారంలో 3,010 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. రోగులు పెరిగినా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ఈటల... ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రేపట్నుంచి నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలోనూ కొవిడ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 350 పడకలు సిద్ధమైనట్లు తెలిపారు.
ప్రభుత్వానిదే బాధ్యత...
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరతను ప్రభుత్వమే తీరుస్తుందని ఈటల స్పష్టం చేశారు. నిబంధనల మేరకే ప్రైవేటు ఆస్పత్రులు ఫీజులు వసూలు చేయాలని మరోసారి హెచ్చరించారు. సాధారణ పడకకు రోజుకు రూ.4 వేలు... ఐసీయూ పడకకు రూ.7,500... ఐసీయూ వెంటిలేటర్ బెడ్‌కు రూ.9 వేలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్లపై కేంద్రం వైఖరి సరిగా లేదని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లు కేంద్రమే సమీకరించాలని ఈటల డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీలో చేర్చటంపై...
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయంలో సీఎం కేసీఆర్ గతంలో సానుకూలంగా స్పందించారని... అయితే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ అనుసంధాన కసరత్తు జరుగుతుండగానే కోవిడ్ రెండో వేవ్ రావడంతో నిలిచిపోయిందని ఈటల చెప్పారు.