ఎలాంటి షరతులు లేకుండానే రైతుల నుంచి పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పత్తి పంట కొనుగోలుపై కొత్తగా సీసీఐ షరతులు విధిస్తూ జీవో విడుదల చేయడాన్ని మంత్రి ఖండించారు. ఈ మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌కు ఎర్రబెల్లి లేఖ రాశారు. ఇప్పటికే అకాల వర్షాలు, తుపాన్‌లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని... ఈ సమయంలో సీసీఐ కొత్త నిబంధనలు పెడుతూ జీవో జారీ చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు.
కనీస మద్దతు ధరతో రైతులను ఆదుకోవాల్సిన సమయంలో అర్థం పర్థం లేని కొత్త నిబంధనలతో రైతులను మరింత ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. రాష్ట్రంలో రైతులు అత్యధికంగా పత్తిని సాగు చేశారని... తుపాన్‌లు అన్నదాతను నట్టేట ముంచాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రైతులు తెచ్చిన పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. వీలైతే మద్దతు ధరను కూడా పెంచాలని కోరారు.