వైద్యశాఖలో త్వరలో 11 వేల నియామకాలు చేపట్టనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ‘రాష్ట్రంలో 54 ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసుకున్నాం. ఈ క్రమంలో పది వేల పోస్టుల్ని భర్తీ చేస్తున్నాం. ఇప్పటికే నాలుగు వేలు భర్తీ చేశాం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం మరో అయిదు వేల పోస్టులు మంజూరు చేసింది. మిగిలిన ఆరు వేలతోపాటు తాజాగా మంజూరు చేసిన 5 వేలతో కలిపి 11 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. వీటిల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులున్నాయి’ అని మంత్రి వివరించారు. కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలతో కొన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటుకూ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. గురువారం ఆయన శాసనసభలో, మండలిలో మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనసభ్యుడు తూర్పు జయ్‌ప్రకాష్‌రెడ్డి(సంగారెడ్డి) సంగారెడ్డి మెడికల్ కళాశాల గురించి అడిగారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు) తన నియోజకవర్గంలో పీహెచ్‌సీ కోసం రెండేళ్ల కిందట భవనాన్ని నిర్మించినా సిబ్బంది లేరన్నారు.
ఇంజక్షన్ ధర గరిష్ఠంగా రూ.32వేలే
కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సకు రూ.లక్షలు వసూలు చేయడం చూసి కలత చెందానని మంత్రి ఈటల అన్నారు. కొవిడ్-19పై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కరోనా సాధారణ చికిత్సకు రూ.10వేలు అవుతుంది. ఐసీయూలో ఉంచితే రూ.50వేల వరకు కావచ్చు. వెంటిలేటర్‌పై పెడితే గరిష్ఠంగా రూ.లక్ష అవుతుంది. చికిత్సలో వినియోగించే ఇంజక్షన్ ధర గరిష్ఠంగా రూ.32వేలు. అది ఒకటి ఇస్తే సరిపోతుంది. విచ్చలవిడిగా వసూళ్లు చేయడంపై కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల్ని పిలిపించి మాట్లాడా. ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటున్నారని హెచ్చరించా’’ అని మంత్రి తెలిపారు.
టోల్‌ఫ్రీ నంబరు కేటాయించండి: గుత్తా సూచన
కరోనా పరీక్షల విషయంలో సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థలు అర్థంపర్థం లేని రాతలు రాశాయని మంత్రి విమర్శించారు. సరిగా చికిత్స అందడం లేదని, ఆక్సిజన్ కొరత ఉందని దుష్ప్రచారం చేయడం ద్వారా గాంధీ ఆసుపత్రిని జయప్రదంగా చంపేశారని, కార్పొరేట్ ఆసుపత్రులే దిక్కు అనే భ్రమ కల్పించగలిగారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చ సందర్భంగా చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు జాఫ్రీ, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అల్గుబెల్లి నర్సిరెడ్డి, కాటేపల్లి జనార్దన్, ఫారుఖ్‌హుస్సేన్, కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు కేటాయించాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంత్రికి సూచించారు.