రాష్ట్రంలో కొవిడ్ టీకాలు ఇచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈటల పాల్గొన్నారు. బీఆర్కే భవన్ నుంచి సమావేశానికి ఈటలతో పాటు... ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు, సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్, డబ్ల్యూహెచ్ ఓ ప్రతినిధులు హాజరయ్యారు.
రాష్ట్రంలో తీసుకుంటున్న కొవిడ్ నియంత్రణ చర్యలతోపాటు... వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై కేంద్రానికి ఈటల వివరించారు. తొలివిడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా హెల్త్ సిబ్బందితోపాటు... గ్రామాల్లోని పంచాయతీ అధికారులకు సైతం వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇక వ్యాక్సిన్ డ్రైరన్‌లో భాగంగా అనేక జిల్లాల్లో సాఫ్ట్వేర్ సమస్యలను గుర్తించామని... వాటిని పరిష్కరించేందుకు కేంద్ర బృందాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు వివరించారు.