హోం ఐసోలేషన్‌లో ఉండే కరోనా రోగులను నిరంతరం పర్యవేక్షించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలెక్టర్లను ఆదేశించారు. వైద్యుల నుంచి ఎప్పటికప్పుడు సరైన కౌన్సిలింగ్ అందేలా చూడాలని సూచించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
కరోనా చికిత్స విషయంలో కలెక్టర్లు.. జిల్లా మంత్రుల సూచనలు తీసుకోవాలని సూచించారు. రోగులందరికీ సరైన వైద్యం అందేలా చూడాలని, వారిలో ధైర్యం నింపేలా జిల్లా పాలనాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. '
వివరాలివ్వండి..
కొవిడ్ పరీక్షలకు వచ్చిన వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి పరీక్షా కేంద్రం వద్దే కిట్‌తో పాటు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. పరీక్షా కేంద్రాలు, ఔషధాలు, సిబ్బంది ఖాళీలు, ప్రైవేటు ఆస్పత్రులను కొవిడ్ చికిత్సకు అనుమతించే వివరాలను అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం..
జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే ఏరియా ఆస్పత్రుల్లో అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని, ఇందుకోసం ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. కొవిడ్‌కు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లుల వివరాలను ప్రభుత్వానికి పంపాలన్న సోమేశ్ కుమార్... చికిత్సకు ప్రోటోకాల్ మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. హోం ఐసోలేషన్ కిట్‌లో ఉండే ఔషదాల వివరాలతో సర్క్యులర్ రూపొందించాలని సూచించారు.
ఇవీచూడండి: 'కరోనా పరీక్షా కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి'