Minister Balineni On Subbarao Gupta Attack issue: ఏపీలోని ఒంగోలులో వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై తన అనుచరులు దాడి చేసిన ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి తమ వాళ్లకు ఆగమని చెప్పానన్నారు. తన గురించి ఒంగోలు ప్రజలకు తెలుసునని, దాడులు చేయడం తమ సంస్కృతి కాదని మంత్రి స్పష్టం చేశారు. మతిస్తిమితం సరిగా లేకే.. గుప్తా ఆ రోజు సభలో అలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అతన్ని కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపానని వెల్లడించారు.
ఒంగోలులో తెదేపా నేతలను తాను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని బాలినేని స్పష్టం చేశారు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముకుంటూ ఉంటారని.. గుప్తాతో తనకు ఎక్కువ పరిచయం ఉన్న మాట వాస్తవమేనని మంత్రి వెల్లడించారు. గుప్తా వ్యాఖ్యల వెనుక తెదేపా నేత దామచర్ల జనార్దన్ ఉండొచ్చని.. బాలినేని అభిప్రాయపడ్డారు. పార్టీలోనే ఉండి విమర్శించడంతో తన అనుచరులు బాధతో దాడి చేసి ఉంటారన్నారు.
"గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి మా వాళ్లను ఆగమని చెప్పా. నా గురించి ఒంగోలు ప్రజలకు తెలుసు. దాడులు చేయడం మా సంస్కృతి కాదు. మతిస్తిమితం లేకే గుప్తా సభలో అలా మాట్లాడారు. సుబ్బారావు గుప్తాను కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపా. ఒంగోలులో తెదేపా నేతలనూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముతుంటారు. గుప్తాకు నాతో ఎక్కువ పరిచయం ఉన్నమాట వాస్తవమే. గుప్తా వ్యాఖ్యల వెనుక దామచర్ల జనార్దన్ పాత్ర ఉండవచ్చు. పార్టీలోనే ఉండి విమర్శించారని నా అనుచరులు దాడి చేసి ఉంటారు." -బాలినేని, ఏపీ మంత్రి
ఏం జరిగిందంటే..
ఈ నెల 12న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వారు మాట్లాడుతున్న భాష, వ్యవహారశైలి అభ్యంతరకరమని.. ఫలితంగా పార్టీకి 20 శాతం వరకు ఓటింగ్ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో తెదేపా గెలిస్తే.. వైకాపా కార్యకర్తలను కర్రలతో తరిమి కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పూటుగా మద్యం తాగిన 15 మందికి పైగా వ్యక్తులు లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా నివాసానికి శనివారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. అయినప్పటికీ అతన్ని దుర్భాషలాడుతూ ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. అంతుచూస్తామని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. వారిని సుబ్బారావు గుప్తా భార్య ప్రతిఘటించటంతో అక్కడి నుంచి బయటికి వచ్చారు. సుబ్బారావు ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి సుబ్బారావు గుప్తా అదృశ్యమయ్యారు. అతని సెల్‌ఫోన్ స్విచాఫ్ అయింది.
తనపై దాడి చేస్తారని భయపడిన గుప్తా.. గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న వైకాపా శ్రేణులు..లాడ్జికి వెళ్లి మరోసారి దాడికి పాల్పడ్డారు. 'పెద్దాయననే విమర్శిస్తావా.. విశ్వాసం లేని కుక్క' అని దుర్భాషలాడుతూ సుభాని అనే కార్యకర్త విచాక్షణారహితంగా దాడి చేశాడు. 'నిన్ను ఇక్కడే చంపేస్తా' అంటూ గుప్తాపై పిడిగుద్దులు కురిపించారు.
'తప్పయిపోయిందన్నా.., నేను చెప్పేది ఒకసారి విను. నాకు షుగర్ ఉంది. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. నేను మీ మనిషిని. నన్ను వదిలేయండి' అంటూ గుప్తా ధీనంగా ప్రాధేయపడినా వారు కనికరించలేదు. మరింత రెచ్చిపోయి గుప్తాపై దాడి చేశారు. మోకాళ్లపై కూర్చొబెట్టి బాలినేనికి క్షమాపణ చెప్పిస్తూ వీడియో రికార్డ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: