ETV Bharat / city

తడిసిన నయనం.. ఆగని పయనం - స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కూలీల ఇక్కట్లు

కొండలను పిండి చేసే చేతులవి.. ఎర్రటి ఎండలో చెమటోడ్చి పనిచేసే కాయకష్టం వారిది.. ఎంతటి విపత్తునైనా మొండిగా ఎదుర్కొనే శ్రామికులు వారు.. శ్రమశక్తే వారికి మనోధైర్యం. ఆకలికి తప్ప దేనికీ భయపడని స్థైర్యం.. అలాంటివారు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నారు! తినడానికి తిండి లేక, చేయడానికి పని దొరక్క.. ఆదరించే దిక్కులేక.. లక్షలమంది సొంతూళ్ల బాట పడుతున్నారు. మూటాముల్లె సర్దుకుని.. మైళ్ల తరబడి కాళ్లీడ్చుకుంటూ.. గుంపులు గుంపులుగా.. విడతలు విడతలుగా.. మిడతల దండల్లే తరలిపోతున్న వలస జీవులను చూస్తే కొండంత విషాదం!

migrant workers facing difficulties in going back to their homes during lock down
తడిసిన నయనం.. ఆగని పయనం
author img

By

Published : May 15, 2020, 5:29 AM IST

Updated : May 15, 2020, 10:26 AM IST

తడిసిన నయనం.. ఆగని పయనం

హైవేల వెంట.. రైలు పట్టాల వెంట.. రోజుల తరబడి అంతులేని పయనం సాగిపోతూనే ఉంది. ఏ దారిన చూసినా.. ఏ ఊరిన చూసినా ఇవే విచలిత దృశ్యాలు. ఈసురోమంటూ పెద్దలు.. కాళ్లీడుస్తూ పసివాళ్లు.. అనంతంగా సాగిపోతున్న వ్యథార్త జీవుల యథార్థ గాథలు.. అంతదూరం సాగలేక దారిలోనే రాలిపోయేవాళ్లు కొందరైతే.. ఎండకు డస్సిపోతున్నవారు మరికొందరు! ఎప్పటికి ముగుస్తుందో ఈ మహావిషాద పయనం!!

చెప్పలేనంత దూరం.. చెప్పులైనా లేకుండానే...

అమ్మచెంగు పట్టుకుని కాళ్లకు చెప్పుల్లేకుండా కాలుతున్న రోడ్డుపై నడిచి వెళ్తున్న చిన్నారి పేరు పూజ. తండ్రి కిరణ్‌, తల్లి రుక్మిణీభాయి. బాలానగర్‌లో ఓ కంపెనీలో పనిచేసేందుకు వీరు రాజస్థాన్‌ నుంచి వచ్చారు. కొద్దిరోజులుగా రైళ్ల కోసం ఎదురుచూసి ఇక లాభం లేదనుకుని నడక మొదలుపెట్టారు. ‘‘ఇంట్లో ఉన్న పిండితో రొట్టెలు చేసుకున్నాం. కొన్ని బట్టలు, నీళ్లసీసాలతో కాలినడక ప్రారంభించాం. లారీలో వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ. 1500 వరకు అడుగుతున్నారు. మా వద్ద ఉన్నవే రూ. 3500. అందుకే కష్టమైనా నడక ప్రారంభించాం’’ అని కిరణ్‌ తెలిపారు. పాపకు చెప్పులు లేకపోవడంతో అలానే నడుస్తుండడం విషాదకరం.

ప్రతి అడుగూ...కన్నీటి మడుగు

నడినెత్తిన సూరీడి మంటలు
పొట్టలో ఆకలి దప్పులు
పాదాల కింద నిప్పుల కుంపట్లు
వీపుపై మూటాముల్లె
చంకలో పసిబిడ్డలు
ఏ దారిన వెళ్తున్నాడో తెలీదు
ఎన్నటికి గమ్యం చేరతాడో అర్థంకాదు
రెండు కాళ్లే చక్రాలై..
చెట్లనక, పుట్లనక, ఎండనక, గాలనక
సుదీర్ఘ పయనం సాగిస్తున్నాడు
బొబ్బలెక్కిన కాళ్లు..
చెమటలు కక్కుతున్న దేహాలు
అలసి సొలసి
రోడ్డుపక్కనే విశ్రమిస్తున్నాయి
దాతల అన్నంతో
పసిబిడ్డల ఆకలి తీర్చి
నీటితో సరిపెట్టుకుంటున్న మాతృమూర్తులు
జానెడు పొట్ట కోసం ఊరు కాని ఊరొస్తే
మహమ్మారి తరిమింది..
వచ్చిన చోటకే పొమ్మంది
ఉన్న ఊరిని, కన్నవారిని
ఎలాగైనా చేరుకోవాలనే తపనతో
వలస జీవి సాగిస్తున్న ఎడతెగని ఈ పయనం
నిరుపేద బతుకు చిత్రానికి నిలువెత్తు దర్పణం
‘నవ భారత నిర్మాత’ల దైన్యానికి కన్నీటి సాక్ష్యం

దేశంలో లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత పనులు దొరక్క, సరైన తిండీ లేక వలస కూలీలు అల్లాడిపోయారు. ఇక తప్పని పరిస్థితిలో సొంతూరి బాట పట్టారు. ఈమేరకు హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారిపై ‘ఈనాడు ప్రతినిధులు’ పరిశీలించారు. అష్టకష్టాలు పడి స్వరాష్ట్రం వెళ్లినా మిగిలేది ఏదీ లేదని వారికి తెలుసు. అయినా సొంత ఊరిలో బతుక్కి భరోసా ఉంటుందన్న ఆశ ఒక్కటే వారిని నడిపిస్తోంది. లాక్‌డౌన్‌ నేడో, రేపో ముగుస్తుందని ఇన్నిరోజులు ఎదురు చూశామని.. రైళ్లు, బస్సులు ఏర్పాటుచేసి తరలిస్తారనుకుని చూసినా ఫలితం లేక వెళ్లిపోతున్నామని బావురుమంటున్నారు. హైదరాబాద్‌ నుంచి మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల వైపు వెళ్లే రోడ్లన్నీ వీరితోనే కిక్కిరిసిపోతున్నాయి.

ప్రయాణ పత్రాలిచ్చి.. నిరాశ పరిచారు

నగరం నుంచి వివిధ రాష్ట్రాలకు రైళ్లు ఏర్పాటు చేయడంతో కూలీలు పోలీస్‌స్టేషన్ల ముందు పడిగాపులు కాసి అనుమతి పత్రాలు పొందారు. ఈనెల మొదటివారంలో రసీదులు, చరవాణిలకు ఓటీపీలు అందుకున్నప్పటికీ వారికి నేటికీ రైళ్లు ఏర్పాటు చేయలేదు. ఈనెల 6వ తేదీనే రైలు ప్రయాణం అనుమతి పొందామని మధ్యప్రదేశ్‌కు చెందిన కోమల్‌సింగ్‌, వీరేన్‌ ఆదివాసీ చెప్పారు. లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి లారీలు వస్తున్నాయి. తిరిగిపోతూ కూలీలను తీసుకెళ్తున్నాయి. కనీసం రూ.800 లేనిదే చత్తీస్‌గడ్‌ వరకైనా తీసుకెళ్లడం లేదు. నాగ్‌పుర్‌నకు రూ.1500, బిహార్‌కు ఒక్కొక్కరికి రూ.4 వేలు, ఎక్కువమంది ఉంటే రూ.2 వేల వరకు లారీడ్రైవర్లు వసూలు చేస్తున్నారు. పశ్చిమబంగ రాష్ట్రానికి రూ.4 వేలు తీసుకుంటున్నారు. దీంతో ఇన్నాళ్లూ తినీతినక మిగుల్చుకున్న మొత్తం కూడా చేజారిపోతోందని కూలీలు పెదవివిరుస్తున్నారు.

ఎక్కువమంది బిహార్‌, ఝార్ఖండ్‌ వైపే..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల నుంచి పరిశ్రమలు, నిర్మాణ రంగ కూలీలు పెద్దఎత్తున జాతీయ రహదారిపై వెళ్తున్నారు. నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల వారు సైతం ఇదే బాట పట్టారు. జిల్లాల్లో ఇన్నాళ్లు మిషన్‌ భగీరథ పనులు చేసినవారు వీరికి జత కలిశారు. మొత్తంగా బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు వెళ్తున్న వారే ఎక్కువగా ఉండగా అందులోనూ యువత పెద్దసంఖ్యలో ఉన్నారు. బేల్దారీ, ఇటుక తయారీ వంటి నైపుణ్యం లేని రంగాల వారిలో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ వాసులున్నారు.

పరిమితికి మించి ఎక్కించి..

ఆహార పదార్థాలను తరలించే సంబంధించి కంటెయినర్‌ లారీల్లో కూలీల తరలింపు ప్రమాదకరంగా సాగుతోంది. ఒక్కో వాహనంలో కనీసం 200 మందికి తగ్గకుండా ఎక్కిస్తున్నారు.

డస్సిపోతున్న గర్భిణులు, పిల్లలు

కుటుంబాలతో సహా నగరానికి తరలివచ్చి ఇన్నాళ్లూ ఉపాధి పొందిన కూలీల కుటుంబాలు కూడా ఇప్పుడు వెనుదిరుగుతున్నాయి. నగరం నుంచి కండ్లకోయ కూడలి వరకు నడిచివచ్చి లారీలు ఎక్కుతున్నారు. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు వెళ్తున్న ఒక్కో లారీలో కనీసం 15 మంది చిన్నారులు, ఐదారుగురు గర్భిణులు ఉంటున్నారని కండ్లకోయ వద్ద కొద్ది రోజులుగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు.

పనిచేస్తున్న ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందే బయలుదేరి నగర శివార్లకు చేరుకుంటున్న వారు సరైన ఆహారం, నిద్ర లేక నీరసించిపోతున్నారు. గర్భిణులు, పిల్లలు ఎండలకు డస్సిపోతున్నారు. ‘నేను నిజామాబాద్‌ నుంచి బిహార్‌ వెళ్తున్నా. ఏడో నెల అయినా తప్పడం లేదు. ఇక్కడ పని లేదు. ఎలాగైనా మా ఊరు చేరుకుని పురుడు పోసుకోవాలన్నదే నా ఆశ’ అంటూ శోభాదేవి అనే గర్భిణి చెప్పింది.

రెండు నెలల్లోనే ఇలా వెళ్లాల్సి వస్తోంది..

వీపునకు బ్యాగులతో బయల్దేరిన ఈ యువకులది బిహార్‌. కూచారం-జీడిపల్లి వద్ద ఇలా జాతీయరహదారిపై సాగిపోతున్నారు. వీరిలో బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారు ఉన్నారు. అందరూ గచ్చిబౌలి, మాదాపూర్‌, పటాన్‌చెరుల్లోని పలు సంస్థల్లో పొట్టపోసుకొనే వారే. ఉపాధి కచ్చితంగా లభిస్తుందనే ఆశతో జనవరిలో హైదరాబాద్‌కు వచ్చామని శివఖేర్‌, నారాయణ అనే యువకులు తెలిపారు.

రెండు నెలల్లోనే ఇలా సర్దుకుని వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ రహదారిపై ఎవరో ఒకరు ఆహారం ఇస్తున్నారంటూ మా ముందు వెళ్తున్న బృందం సభ్యులు ఫోన్‌లో చెప్పారు. ఇరవై రోజులైనా ఇలా నడిచే వెళ్తాం. ఊర్లో ఉంటే కుటుంబంతో ఉన్నామన్న ఆనందం మిగులుతుంది’’ అని విఘ్నాన్వేష్‌ అనే యువకుడు తెలిపారు.

కడుపునిండా తిని ఎన్ని రోజులయిందో..

‘‘సొంతూరులో పెద్ద పిల్ల ఎట్లా ఉందోననే ఆలోచన ఒకవైపు. ఇక్కడ ఉన్న చిన్నబిడ్డకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామన్న బాధ మరోవైపు. లాక్‌డౌన్‌ మొదట్లో ఉన్న బియ్యంతో గంజి కాచుకున్నాం. కొన్నిసార్లు దాతలు పెడితే తిన్నాం. బతికితే చాలు అన్నట్లు గడిపాం. ఇప్పుడిక ఇంటి దారిపట్టినం. దొరికితే లారీ ఎక్కుతం. లేకుంటే నడుద్దామని నిర్ణయించుకున్నాం’’ అంటూ బాధలను వెళ్లగక్కారు నాగ్‌పుర్‌కు బయలుదేరిన సాహ్నిసోహెల్‌, లక్ష్మీపంత్‌.

నగర శివారుల్లో దాతలు పెట్టిన భోజనం తింటూ తమ బాధను వివరించారు. నాగ్‌పుర్‌ శివారుల్లోని గ్రామంలో సొంతిల్లు ఉందన్నారు. అక్కడ పనుల్లేవని తోటివారితో ఐదు నెలల క్రితం పటాన్‌చెరులో ఓ కంపెనీలో పనిచేసేందుకు వచ్చామని చెప్పారు. ఇద్దరికి కలిపి రోజుకు రూ.550 వచ్చేవన్నారు. దాచిన పైసలన్నీ అయిపోయాయని వాపోయారు. పది రోజులుగా ఒట్టి అన్నం తింటున్నామంటూ ఈ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు.

కన్నీరు ఇంకింది.. ఇంకేముంది..?

అర్ధాకలితో అలమటించారు. బయటకు వెళ్లే అవకాశం లేక ఇరుకు గదుల్లోనే మగ్గారు. రెండు నెలలుగా పైసా సంపాదన లేదు. సొంతూరుకు వెళ్దామంటే రైళ్లు, బస్సులు లేవు. ఇద్దరు చంటి పిల్లలను వేసుకుని ఇక్కడ బతకడమెట్లా దేవుడా.. అంటూ ఆ దంపతులు కన్నీరు పెట్టుకొన్నారు. కష్టాలను దిగమింగుకొని సొంతూరుకు బయల్దేరారు. 15 కిలోమీటర్లు నడిచి నగర శివారుల్లోని కండ్లకోయ కూడలికి చేరుకున్నారు మనోజ్‌, రజనీ దంపతులు. అక్కడకు రాగానే దాతలు ఇచ్చిన రొట్టెలు, అప్పలను పిల్లలకు పెట్టారు. కొన్ని రొట్టెలను బ్యాగులో వేసుకున్నారు. పిల్లల కోసం మజ్జిగ ప్యాకెట్లను సమకూర్చుకున్నారు. ఏదైనా వాహనం రాకపోదా అంటూ అక్కడే కూలబడ్డారు.

‘‘ఎక్కువ మొత్తం కూలి వస్తుందని ఆశపడి వందల కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం పండారియా తహసీల్‌ నుంచి వచ్చి ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో పని చేస్తున్నాం. లాక్‌డౌన్‌ మమ్మల్ని కుంగదీసింది. మా కడుపున పుట్టినందుకు పిల్లలను చూస్తే బాధవుతోంది. తింటానికీ ఏమీ దొరక్క అల్లాడిపోతున్నారు. కూడగట్టినవి అడుగంటాయి. మున్ముందు పని ఉంటుందో లేదో తెలియదు’’ అంటూ ఆవేదన వెళ్లగక్కాడు మనోజ్‌. తమ రాష్ట్రంలో రోజుకు రూ.250 కూడా రావని.. ఇక్కడ రూ.450 వస్తున్నాయని తెలిపాడు. ‘చివరికి పిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది’ అంటూ రజని కన్నీటి పర్యంతమైంది.

ఆశలు ఆవిరై..

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మనోహరాబాద్‌ సమీపంలో జాతీయ రహదారిపై బ్యాట్‌కు బ్యాగులను తగిలించి ఈడ్చుకెళుతున్న వీరి పేర్లు దినేశ్‌, మంగేశ్‌. నాగ్‌పుర్‌ నుంచి వచ్చారు. నగరంలోని శానిటైజర్‌ సీసాలు తయారు చేసే పరిశ్రమలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించడంతో తమ కోసం రైళ్లు, బస్సులు వేస్తారేమోనని ఇన్నాళ్లూ ఎదురుచూశారు. ఇక లాభం లేదనుకుని కాలినడకన బయలుదేరారు. నగరం దాటి 55 కిలోమీటర్లు నడిచారు. ‘లాక్‌డౌన్‌తో కష్టాలు వచ్చాయి. ఐదు నెలలుగా ఇక్కడ పనిచేసి దాచుకున్న డబ్బు కరిగిపోతోంది. ఇంటి వద్ద అమ్మానాన్న, అక్కాచెల్లి ఉన్నారు’ అని దినేశ్‌ తెలిపారు. ‘పనులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక బయలుదేరాం’ అంటూ మంగేశ్‌ వాపోయారు.

దండుకుంటున్న డ్రైవర్లు

ఉపాధి లేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న వలస కూలీల జేబులు ఖాళీ అవుతున్నాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు హైదరాబాద్‌- నాగ్‌పుర్‌ జాతీయ రహదారిపై మేడ్చల్‌ సమీపంలో ఖాళీగా ఉన్న లారీలను ఆశ్రయిస్తున్నారు.లారీ డ్రైవర్లు భారీగా డిమాండు చేస్తుండటంతో ఉసూరు మంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉపాధి పొందుతున్న వలస కూలీలు 5.12 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో అత్యధికంగా కర్మాగారాలు, చిన్న పరిశ్రమలు, భవన నిర్మాణ పనులలో పాలుపంచుకుంటున్నారు.

300 కిలోమీటర్లు నడిచారు.. ఓపిక లేక విరామం

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్‌చంపా జిల్లాకు చెందిన 11 మంది ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. లాక్‌డౌన్‌ మొదలయ్యాక పని లేదు.. పైసలు అయిపోయాయి. దీంతో వారం క్రితం అక్కడినుంచి బయలుదేరారు. గురువారానికి మెదక్‌ జిల్లా తూప్రాన్‌ వరకు చేరుకున్నారు. ఈ మధ్యలో సగం దూరం నడిచారు. మరో సగం వివిధ వాహనాలపై ప్రయాణించారు. తూప్రాన్‌ వద్ద లారీల వాళ్లు ఆపకపోవడంతో ఇలా చెట్ల కింద కనిపించారు. ఇక నడిచే ఓపిక లేదని, అన్నం లేక నీరసంగా ఉందని వాపోయారు. జీవితంలో మళ్లీ ఊరు దాటి రామని, ప్రస్తుతానికి ఏదోరకంగా సొంతూరు వెళ్లగలిగితే అంతే చాలని చెప్పుకొచ్చారు. వారం నుంచి దొరికిన చోట తింటున్నామని, లేకుంటే ఖాళీ కడుపుతోనే ఉంటున్నామన్నారు.

కింద మేకలు.. పైన కూలీలు

నగరాల నుంచి సొంతూర్లకు వెళ్లేందుకు వలస కూలీలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. మేకల వ్యాపారం చేసే ఒకతను హైదరాబాద్‌ నుంచి వస్తుండగా.. నాగ్‌పుర్‌ వైపు వెళ్తున్న వలసజీవులు వాహనం ఆపారు. కింద మేకలు ఉండటంతో ఖాళీగా ఉన్న పైభాగంలో వారిని కూర్చోబెట్టాడు.

Last Updated : May 15, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.