అతి చవక ప్రయాణం.. 9 నెలలుగా దూరం
రైలు ప్రయాణం ముఖ్యంగా లోకల్ రైలు టికెట్లు చాలా చవక. 150కి.మీ. దూరం వరకు నెల, మూడు నెలలు, ఆరు నెలల వ్యవధితో పాస్‌లను రైల్వేశాఖ ఇస్తుంది. దూరాన్ని బట్టి రూ.రెండొందల నుంచి రూ.ఆరేడు వందలతో నెల రోజులు రాకపోకలు సాగించవచ్చు. బీబీనగర్, భువనగిరి, ఆలేరు, జనగాం, వరంగల్, రామన్నపేట, నల్గొండ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల.. మేడ్చల్..తాండూరు..వంటి ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, దుకాణాల్లో పనిచేసేవారు, కంపెనీల్లో పనిచేసే కార్మికులు భారీసంఖ్యలో హైదరాబాద్‌కు వచ్చిపోతుంటారు. ఒక్క భువనగిరి స్టేషన్ నుంచి నాలుగైదు వేలమంది..జనగాం స్టేషన్ నుంచి ఐదారు వేలమంది హైదరాబాద్ వచ్చిపోతుంటారు. కరోనాతో ఈ రైళ్లు ఆగాయి. ఆ పాస్‌ల జారీ ఆగింది. దీంతో ప్రయాణదూరాన్ని బట్టి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు రాకపోకలకు రెండు, మూడు వేల నుంచి పదివేల రూపాయల వరకు ప్రయాణఖర్చు అవుతోందని చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో అలా..
కరోనా నేపథ్యంలో రిజర్వేషన్ ప్రయాణాల్ని అనుమతిస్తున్నామని రైల్వేశాఖ చెబుతోంది. మరోవైపు ముంబయి, కోల్‌కతాల్లో సబర్బన్ రైళ్లు తిరుగుతున్నాయి. తమిళనాడులో రాష్ట్రం పరిధిలో తిరిగేలా పలు రైళ్లకు రైల్వేశాఖ అనుమతించింది. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. అదేరీతిలో హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లను, చుట్టుపక్కల జిల్లాల నుంచి డెము, మెము రైళ్లను త్వరగా పట్టాలు ఎక్కించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బైక్‌పై 150 కి.మీ. ప్రయాణం
లోకల్ రైళ్లు లేక కొందరు బస్సులు, ఇంకొందరు కార్లలో ఉద్యోగం చేసేచోటుకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేనివారు ఇద్దరు కలిసి బైక్‌లపై వెళ్లివస్తూ రోజూ 100-150కి.మీ. ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్‌లో కొందరు దుకాణాల యజమానులు తమ ఉద్యోగుల బస్సు ఛార్జీల్లో సగం భరిస్తున్నారు.
ఇంటి యజమాని సాయం
జనగామ పట్టణానికి చెందిన కుర్రెంల వెంకటేశ్ బీబీనగర్‌లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి. జీతం రూ.15వేలు. భార్య ప్రైవేటు స్కూల్లో టీచర్. కరోనా ప్రభావంతో ఆమె ఉద్యోగం పోయింది. లోకల్ రైళ్లు లేకపోవడంతో..రుణంతో బైక్ కొన్నాడు. ఆయన ఆర్థిక ఇబ్బందులు చూసి ఇంటి యజమాని కొంత సాయం చేస్తున్నారు.
జనగామ జిల్లాకి చెందిన గంగారపు జితేందర్ సికింద్రాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో సూపర్‌వైజర్. కరోనా ప్రభావంతో స్థానిక రైళ్లు బంద్ కావడంతో 20 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. దీనికి రూ.20వేల జీతంలో సగం ఛార్జీలకు పోవడమే. బస్‌ఛార్జీలు భరించాలని యజమానిని అడిగితే..మాకే వ్యాపారం జరగట్లేదు. నీకెలా ఇస్తానన్నాడు. దీంతో కుటుంబ పోషణకు ఊళ్లోనే కూలి పనులకు వెళ్తున్నానన్నాడు.
మహబూబ్‌నగర్‌కి చెందిన విజయ్‌కుమార్ హైదరాబాద్‌లో ఓ కంపెనీలో మేనేజర్. 13 ఏళ్లుగా రైల్లోనే రాకపోకలు. ప్రతినెలా రైలుపాస్‌కు రూ.640 ఖర్చు చేస్తే సరిపోయేది. లాక్‌డౌన్ నుంచి రైలు ప్రయాణానికి అవకాశం లేక మరో ముగ్గురుతో కలిసి కారులో ఉద్యోగానికి వెళ్లివస్తున్నారు. నెలకు ఒక్కొక్కరికి రూ.10వేలు ప్రయాణ ఖర్చవుతోంది.
కుటుంబం ఒకచోట.. తానోచోట
సికింద్రాబాద్‌లో స్టీల్‌షాప్‌లో పనిచేస్తున్నా. 30 ఏళ్లుగా జనగామ నుంచి కాకతీయ, పుష్‌ఫుల్ రైళ్లలో వచ్చి వెళ్లేవాడిని. నెల పాస్‌కు రూ.560 సరిపోయేది. ఇప్పుడు బస్సులో వచ్చిపోవడానికి రోజుకు రూ.400 అవుతున్నాయి. వచ్చే జీతమే రూ.15వేలు. ప్రయాణ ఖర్చులు భరించలేక, కుటుంబానికి దూరంగా నగరంలో తక్కువ అద్దె గదిలో ఉంటున్నా. - పద్మనాభం, జనగామ
ఐదు నెలలు బండిపై వెళ్లి వచ్చా
ఓయూలో కాంట్రాక్ట్ ఉద్యోగం. కరోనాకు ముందు ఏడాది రైలు ఛార్జీల ఖర్చు రూ.మూడువేల లోపయ్యేది. లాక్‌డౌన్ ఐదునెలలు బండిపైనే రాకపోకలు సాగించా. నెలకు రూ.5వేలు ఖర్చయ్యేది. రైల్లో వెళితే 1.15 గంటల్లో గమ్యం చేరేవాడిని. బస్సులో 2 గంటలు. -ఫసీయుద్దీన్, భువనగిరి
రైల్వే బోర్డు నిర్ణయం వచ్చాకే..
ద.మ.రైల్వే జోన్ పరిధిలో ఎంఎంటీఎస్, మెము, డెము..లోకల్ రైళ్లను నడిపే విషయాన్ని నిర్ణయించాల్సింది రైల్వేబోర్డే. ఒకసారి రైల్వేబోర్డు నుంచి అనుమతి ఇస్తే ఆ తర్వాత రద్దీని బట్టి సర్వీసులు పెంచే అంశం జోన్ పరిధిలో ఉంటుంది. - సీహెచ్ రాకేశ్, సీపీఆర్వో దక్షిణమధ్య రైల్వే
ఇవీ చూడండి: పండుగల కోసం ప్రత్యేక రైళ్లు... రాకపోకల తేదీలివే...