కొవిడ్ మూలంగా దేశవ్యాప్తంగా స్థిరాస్తి ధరలు కొంతమేర తగ్గడమే కాకుండా... బ్యాంకులు కూడా తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నా... ఇళ్లను కొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. ఈ క్రమంలో "నోబ్రోకర్.కామ్'' సంస్థ దేశంలో స్థిరాస్తి లావాదేవీలపై నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోని ప్రముఖ నగరాలైన బెంగళూరు, ముంబయి, పూణె, చెన్నై, హైదరాబాద్, దిల్లీలోని 17,652 మంది ద్వారా స్థిరాస్తి లావాదేవీలపై సర్వే చేసింది.
కట్టిన ఇళ్లకే డిమాండ్...
సర్వేలో 82 శాతం మంది వచ్చే ఏడాది ఇళ్లను కొనుగోలు చేస్తామని చెప్పినట్లు ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా గృహాలు కొనుగోలు చేస్తున్న వారిలో అత్యధికంగా 35 నుంచి 45 ఏళ్ల వారే అత్యధికంగా 41 శాతం మంది ఉన్నారు. 2019లో 49 శాతంగా ఉన్న 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు 2020లో 63 శాతానికి ఎగబాకారు. ఇళ్లను కొనుగోలు చేసేందుకు చొరవ చూపుతున్న వారిలో దేశవ్యాప్తంగా తీసుకుంటే... 57శాతం మంది నిర్మాణం పూర్తయి ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ శాతం 54 గా ఉంది. దేశంలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నవారిలో 76 శాతం మొదటిసారి తీసుకుంటున్న వారుండగా... హైదరాబాద్‌లో ఆ శాతం 84గా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇది దేశంలో అత్యధిక శాతంగా ఆ సంస్థ పేర్కొంది.
ఇండిపెండెంట్ ఇళ్లకే ప్రాధాన్యం...
సొంతానికి ఉపయోగించుకోడానికి 89శాతం మంది ఇళ్లను కొనుగోలు చేస్తుండగా... కేవలం 11 శాతం మంది మాత్రమే పెట్టుబడుల కోసం కొనుగోలు చేస్తున్నారు. సొంతానికి కొనుగోలు చేస్తున్న వారిలో బెంగుళూరు, ముంబయి నగరాల్లో అత్యధికంగా 92శాతం ఉండగా... హైదరాబాద్‌లో అత్యల్పంగా 84 శాతంగా ఉంది. అపార్ట్మెంట్లల్లో నివాసం ఉండేందుకు దేశంలో 61శాతం మంది ప్రాధాన్యత ఇస్తుండగా... ఇండిపెండెంట్ ఇళ్లపై కేవలం 28శాతం మంది మక్కువ చూపుతున్నారు. నగరాల వారీగా తీసుకుంటే ముంబయిలో అత్యధికంగా 82శాతం, పూణెలో 69శాతం ఉండగా.... అత్యల్పంగా హైదరాబాద్‌లో 44శాతం మాత్రమే అపార్ట్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇండిపెండెంట్ ఇళ్ల కోసం అత్యధికంగా హైదరాబాద్‌లో 46శాతం చొరవ చూపుతుండగా అత్యల్పంగా ముంబయి 14శాతం, పూణెలో 21శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.
వాస్తు ప్రాముఖ్యతా ఎక్కువే...
వాస్తు కోసం ప్రాధాన్యత ఇస్తున్న వారు... దేశ వ్యాప్తంగా 76శాతం ఉండగా... హైదరాబాద్‌లో అత్యధికంగా 89శాతం ప్రజలున్నారు. ఇక ఇళ్లను కొంటున్న వారిలో... 58శాతం మంది రూ.60 లక్షల లోపు బడ్జెట్ ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తుండగా... 60 నుంచి 80లక్షల మధ్య బడ్జెట్ ఇళ్లకు 12శాతం మంది మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. 80 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య బడ్జెట్ కలిగిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు 19శాతం మంది చొరవ చూపిస్తున్నారు. కోటి అంతకు మించి బడ్జెట్ కలిగిన ఇళ్లను కొంటున్న వారు...11 శాతంగా ఉన్నారు.
హైదరాబాద్లోనే ఎక్కువ...
హైదరాబాద్‌లో తీసుకుంటే 60 లక్షలలోపు ఇళ్ల కోసం 66శాతం మంది, 60 నుంచి 80లక్షలు మధ్య బడ్జెట్ ఇళ్ల కోసం 13శాతం మంది, 80లక్షల నుంచి కోటి మధ్య బడ్జెట్ ఇళ్లకోసం 13శాతం మంది, కోటికిపైన బడ్జెట్ కలిగిన గృహాల కోసం ఏకంగా 20శాతం మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. ఇది దేశంలోని బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, పూణెల కంటే కూడా ఎక్కువని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకే ఓటు...
దేశ వ్యాప్తంగా రెండు పడకగదుల ఇళ్ల కోసం 48 శాతం మంది మక్కువ చూపుతున్నారు. మూడు పడకగదుల ఇళ్ల కోసం 29శాతం, సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 18శాతం, నాలుగు పడక గదుల ఇళ్ల కోసం 5శాతం మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే మూడు పడక గదులు ఇళ్ల కోసం ప్రాధాన్యత ఇస్తున్న వారు దేశ వ్యాప్తంగా 9శాతం పెరిగినట్లు వెల్లడైంది. రెండు పడక గదుల ఇళ్లకు, మూడు పడకగదుల ఇళ్లకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో తీసుకుంటే... కూకట్‌పల్లి, మాదాపూర్, మణికొండ, ఎల్బీనగర్, బోడుప్పల్ ప్రాంతాల్లో గృహాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ సంస్థ పరిశీలనలో తెలిసింది.
అద్దె ఇళ్ల కోసం మధ్యవర్తులను సంప్రదించే సంస్కృతి క్రమంగా తగ్గిపోతోంది. స్నేహితులు, బంధువులు, స్థిరాస్థి వెబ్‌సైట్లు, టూలెట్ బోర్డుల ఆధారంగా అద్దెకు ఇళ్లు తీసుకుంటున్నారు. ఇందులో రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్లు, స్నేహితుల ద్వారానే దాదాపు 70శాతం మంది అద్దె ఇళ్లను పొందుతున్నారు.