ఇప్పటి వరకు పేజీల కొద్దీ సమాచారం అందించిన బ్లాగర్లు ఇప్పుడు మైక్రో బ్లాగింగ్పై ఆసక్తి చూపుతున్నారు. ఆహారం, జీవనశైలి, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ఫ్యాషన్ తదితర అంశాలను ప్రేక్షకులకు పంచుతున్నారు. హైదరాబాద్ నగరంలో 60కి పైగా మైక్రో బ్లాగర్లు ఉన్నారు. లక్ష మంది అనుసరించేవి పది బ్లాగులుంటే, 10 వేల మంది అనుసరించేవి 30 ఉన్నాయి.
తేడా ఏంటి...?
సమాచారాన్ని సూటిగా చెప్పేందుకు మైక్రో బ్లాగింగ్ ఉపయోగపడుతుంది. సంప్రదాయ బ్లాగింగ్‌లో 500 పదాల నిడివి ఉన్న సమాచారాన్ని ఇస్తే.. మైక్రో బ్లాగింగ్‌లో 150 పదాల్లోనే చెప్పేస్తారు. ఈ సమాచారం ఆడియో, వీడియో, రాతపూర్వకంగా ఉంటుంది. నిడివి తక్కువగా ఉండటంతో ఇతర బ్లాగ్‌లను ప్రచారం చేసుకోవడమూ సులభంగా మారింది.
మార్కెటింగ్ చేయాలంటూ అభ్యర్థనలు..
నగరానికి చెందిన జుబైర్ అలీ ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేరుతో, కార్తీక్ గాంధీ- గ్యాస్ట్రో హాగర్, ఫరాజ్- స్పూన్‌ఫుల్ హైదరాబాద్, శానిక- గ్యాస్ట్రోనామికల్ ఎఫైర్, వాసంతి- టేస్టీ డ్రిప్స్ మైక్రోబ్లాగ్‌లతో పేరు తెచ్చుకున్నారు. వీరి బ్లాగ్‌లను చాలా మంది అనుసరిస్తున్నారు. ఎక్కువ మంది అనుసరించే బ్లాగు నిర్వాహకులను పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయమని అడుగుతున్నాయి.
- ఇదీ చూడండి : యువతపై గంజాయ్ వల.. విస్తృతమైన సరఫరా...