Hyderabad Metro: మెట్రో రైళ్లు నేడు యథాతథంగా నడవనున్నాయి. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా రీత్యా రెండురోజులు మెట్రోసేవలు బంద్ అని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ప్రచారాన్ని మెట్రో అధికారులు ఖండించారు. రోజువారీ మాదిరిగానే ఇవాళ మెట్రో రైళ్లు మూడు కారిడార్లలో యథాతథంగా నడుస్తాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
పరేడ్‌గ్రౌండ్‌లో ఇవాళ సాయంత్రం జరిగే భాజపా విజయ్‌సంకల్ప సభ కారణంగా నగరంలో మ.2 గంటల నుంచి రాత్రి 10 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. సభకు వచ్చే వాహనాలు, కార్యకర్తలతో పరేడ్ మైదానం చుట్టు పక్కల రద్దీ అధికంగా ఉంటుంది. ఆయా మార్గాల్లో వెళ్లే వారికి ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో మెట్రోనే ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
సభకు వచ్చేలా..
సభ జరిగే సమీపంలోనే పరేడ్ గ్రౌండ్, జేబీఎస్ మెట్రోరైలు స్టేషన్లు ఉండటంతో సిటీలోని పలు ప్రాంతాల నుంచి భాజపా కార్యకర్తల బృందాలు మెట్రోలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆదివారం హాలిడే పాస్ రూ.59కే మెట్రో అందిస్తోంది. దీంతో ఎక్కువ మంది ట్రాఫిక్ సమస్యలు లేకుండా మెట్రోని వినియోగించుకుని సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. దూర ప్రాంతాల నుంచి రైళ్లలోనూ కార్యకర్తలు హైదరాబాద్ వస్తున్నారు.
ఇవీ చదవండి: