'అయ్యా..! అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కుమారుడు ముక్కు నుంచి రక్తం కారే.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయిదేళ్ల నుంచి అతడిని బతికించడానికి చేసిన చికిత్స కోసం ఉన్నదంతా ఖర్చుపెట్టేశాం. ఎన్నో ఆసుపత్రులు తిప్పాం. ఇక లాభం లేదు.. మా వల్ల కాదని డాక్టర్లు చేతులెత్తేశారు. నా కుమారుడు బతుకుతాడేమోనని ఎన్నో దేవుళ్లకు ప్రార్థించా. ఆ ప్రార్థనలు ఫలించలేదు. నా బిడ్డ బాధను చూడలేకపోతున్నాం. గుండె తరుక్కుపోతోంది.. జడ్జి గారూ..! మీరే ఏదో నిర్ణయం తీసుకోండి. శారీరకంగా వాడు, మానసికంగా మేము ఈ బాధ పడేకన్నా.. మీరే ఏదో ఒకటి చేయాలి. వాడి ప్రాణం తేలికగా పోవడానికైనా మీరు అనుమతించాలి. ఇందుకు కారుణ్య మరణమే (Mercy killing).. శరణ్యం.' అని తన కొడుకుతో కోర్టుకు వచ్చింది ఆ తల్లి. తిరిగి వెళ్తుంటే.. ఆమె చేతిలోనే.. ఆ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.
బిడ్డ నరకయాతన చూడలేక...
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బీర్జెపల్లికి చెందిన మణి, అరుణ కుమారుడు హర్షవర్ధన్(9) అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ఐదేళ్లుగా పోరాడాడు. ఐదేళ్ల క్రితం పాఠశాలలో ఉండగా జరిగిన ప్రమాదంలో.. హర్షవర్ధన్లో ఓ వ్యాధి వెలుగుచూసింది. కారణం లేకుండా శరీరభాగాల నుంచి రక్తం ధారలా కారిపోయే.. ఆ వ్యాధిని మాన్పించేందుకు హర్షవర్ధన్ తల్లిదండ్రులు చేయని ప్రయత్నాలు లేవు. కడుపేద కుటుంబం కావడంతో.. ఉన్నదంతా అమ్మేసి.. అప్పులు చేసి వైద్యం చేయించినా.. హర్షవర్ధన్ కోలుకోలేదు. కుమారుడిపై తండ్రి ఆశలు వదిలేసుకున్నా.. తల్లి అరుణ మాత్రం ఎడతెగని పోరాటం చేస్తూనే ఉంది. తన బిడ్డను బతికించుకునే ఎందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రయత్నించింది. ఎక్కడ చూపించినా వైద్యులు తమ వల్ల కాదని చెప్పేయడంతో.. తన బిడ్డ బాధ చూడలేక.. ప్రభుత్వమే ఆదుకోవాలని లేదా కారుణ్య మరణం (Mercy killing) ప్రసాదించాలని కోరుతూ.. పుంగనూరు కోర్టును వేడుకోవాలని రెండు రోజులుగా ప్రయత్నం చేస్తోంది. కోర్టు సెలవులో ఉండటంతో.. ఆ వేదనతోనే తిరిగి ప్రయాణం అవుతున్న ఆ తల్లిని విధి వెక్కిరించింది.
కలచివేసిన ఘటన
కోర్టు సెలవులు అని స్థానికులు చెప్పడంతో తిరుగు ప్రయాణం అవుతుండగా హర్షవర్ధన్ ఆమె చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయినా.. ఇన్నేళ్ల పాటు ప్రాణాలతో పోరాడిన తన పేగుబంధం కోసం ఎన్నో కష్టాలను చూసింది ఆ తల్లి. తన కుమారుడు విగతజీవిగా మారాడని తెలిసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించటం అందరినీ కలచివేస్తోంది. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు... ఆ తల్లి పడిన కష్టం... విధిలేని పరిస్థితుల్లో కారుణ్య మరణాన్ని (Mercy killing) వేడుకోవడం.. అదే సమయంలో ఆ బాలుడు మృతి చెందటం... స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి: ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత