ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఈ రోజుల్లో ఫోన్‌లో అలారం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మలుగూరు వాసులకు మాత్రం ఆ అవసరం లేదు. ఎందుకంటే వందలాది కాకుల అరుపులతో ఆ గ్రామస్థులు తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. ప్రతిరోజు ఉదయం ఐదున్నర అయితే చాలు.. వందలాది కాకులు ఆయన ఇంటిపై చేరి అరవటం ప్రారంభిస్తాయి. వాటికి ఆహారం పెట్టే వరకూ గోల చేస్తూనే ఉంటాయి.
హిందూపురం మండలం మలుగూరులో ఇది నిత్యకృత్యం. మలుగూరు గ్రామంలోని సత్యనారాయణ శెట్టి అనే కిరాణ వ్యాపారి కాకులకు భోజనం పెట్టి పెంచుతున్నారు. ఒకటీ రెండు కాదు.. 20 ఏళ్లుగా వాటికి ఆహారం అందిస్తూనే ఉన్నారు.
కిరాణమే ఉపాధి
ఊళ్లో చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న సత్యనారాయణ.. 20 సంవత్సరాల క్రితం ఇంటి ముందు అరుస్తున్న ఓ కాకి ఆహారాన్ని అందించాడు. ఆ విధంగా మొదలైన కాకుల రాక.. రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా.. వందకు పైగానే కాకులు ప్రతిరోజూ సత్యనారాయణ ఇంటి ముందు తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయానికి క్రమం తప్పకుండా వచ్చి వాలుతాయి.
కాకుల అరుపులు వినగానే సత్యనారాయణ.. బొరుగులు, కారా, మిక్చర్ వంటి ఏదో ఒక తినుబండారం వాటికి ఆహారంగా వేయగానే.. కాకులు వచ్చి ఆ ఆహారాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కాకులు అరిచాయంటే.. ఆ ఊళ్లోనివాళ్లు సమయం ఉదయం ఐదున్నర గంటలు అయినట్టుగా నిర్ధరించుకుంటారు. ఒకటా.. రెండా..? రెండు దశాబ్దాల అలవాటు మరి!
ఇదీ చదవండి: Vemulawada Temple: రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపు.. వివరాలివే!