సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఉన్న హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించి.. అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని(bronze statue of allu ramalingaiah) చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు రామలింగయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్లు రామలింగయ్య, తనది గురుశిష్యుల అనుబంధమని చెప్పారు. రాజమహేంద్రవరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న ఆయన.. నటుడిగా జన్మించింది రాజమహేంద్రవరం గడ్డమీదే అని అన్నారు.
'మా ఇద్దరి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. సినిమాల్లో ఆయన హాస్యాన్ని పండించారు. కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం జీవితాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, హోమియోపతి.. ఇలా ఎన్నో గొప్ప విషయాల గురించి ఆయన నాతో చెప్పేవారు. ముఖ్యంగా హోమియోపతి గురించి ఆయన నాకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ హోమియోపతి మీద ఉన్న ఆసక్తితో అందులో శిక్షణ తీసుకుని ఆర్‌ఎంపీ పట్టా పొందారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిత్యవిద్యార్థి. నటుడిగా ఉంటూ హోమియోపతి గురించి చాలా చదివారు. మా కుటుంబమంతా హోమియోపతే వాడుతాం. - చిరంజీవి, సినీ నటుడు
నటుడిగా తన ప్రయాణం మొదలైంది రాజమండ్రి గడ్డమీదనే అని చిరు పేర్కొన్నారు. ‘పునాదిరాళ్లు’తోపాటు చాలా సినిమాల షూటింగులు ఈ జిల్లాలోనే జరిగాయని చెప్పారు. ‘మన ఊరి పాండవులు’ సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి అల్లు రామలింగయ్య గారిని కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఆయన తనను అల్లుడిగా ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారని పేర్కొన్నారు. అలా ఆ అనుబంధం కొనసాగిందని వివరించారు. అలాగే, ఆయన ఏదైనా అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారని.. చిన్న ఊరిలో జన్మించినా సినిమా పరిశ్రమలోకి వచ్చి హాస్యనటుడిగా అనుకున్నది సాధించి పద్మశ్రీ పొందారంటే ఆయన పట్టుదల ఆషామాషీ కాదని కొనియాడారు. ఎప్పటికీ ఆయన తనకు స్ఫూర్తి ప్రదాత అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పవన్‌కల్యాణ్‌తో సినీ నిర్మాతలు భేటీ... చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చ