Godavari Kaveri link project: గోదావరి-కావేరి అనుసంధానంపై అన్నిరాష్ట్రాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయని కేంద్రం వెల్లడించింది. గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టుపై 5 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశమైంది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో దిల్లీలోని జలశక్తిశాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో జరిగిన సమావేశానికి జలశక్తి శాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ, 5 రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. నదుల అనుసంధానంపై జలశక్తి, ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు.. 5 రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్నారు. రాష్ట్రాలు పాత విధానానికే కట్టుబడి ఉన్నాయని జలశక్తిశాఖ అధికారులు స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా పనుల ప్రారంభం..
రాష్ట్రాల సమస్యలను త్వరగా కొలిక్కి తెచ్చేలా చూస్తామని జలశక్తి శాఖ పేర్కొంది. కొన్ని అంశాలపై రాష్ట్రాలతో విడిగా మాట్లాడతామని జలశక్తి శాఖ కార్యదర్శి తెలిపారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గోదావరి జలాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ, ఏపీ కోరాయని కేంద్రం స్పష్టం చేసింది.
రాష్ట్రాలు ఏమన్నాయంటే..
సమావేశంలో పాల్గొన్న తెలంగాణ.. గోదావరిలో నీటి లభ్యత ఎంత అనేది తేల్చాలని డిమాండ్ చేసింది. పోలవరం నుంచి అనుసంధానం చేయాలని ఏపీ కోరింది. మిగులు జలాలు తరలిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ తెలిపింది. అనుసంధానంతో తమకు లబ్ధి చేకూరితే అభ్యంతరం లేదని కర్ణాటక వెల్లడించింది. ప్రాజెక్టుకు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఇది కేవలం సూత్రప్రాయ భేటీ అని అధికారులకు జలశక్తిశాఖ కార్యదర్శి తెలిపారు.
ఇదీ చూడండి: