ఏపీ సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు కాళ్లకు దెబ్బలు కనిపిస్తుండటం.. సంచలనంగా మారింది. పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణమరాజు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఎంపీకి తాజాగా గాయాలైనట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణమరాజుకు గాయాలయ్యాయి. ఆయన కాళ్లు కమిలిపోయి... గాయాలు కనిపిస్తున్నాయి. పోలీసులే తనను కొట్టారంటూ.. ఎంపీ స్వయంగా న్యాయమూర్తికి తెలిపారు. ఆయనకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సమాజంలో కులాల మధ్య ద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు.. ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం అరెస్టు చేశారు. శుక్రవారం ఎంపీ జన్మదినం కావడంతో కుటుంబసభ్యులతోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏపీకి తరలించారు. విజయవాడ సమీపంలోని సీఐడీ పోలీసుస్టేషన్లో రాత్రంతా ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు రిమాండ్ కోసం హాజరుపరిచారు.
సీఐడీ కస్టడీలో తనను గాయపరిచారని రఘురామకృష్ణమరాజు పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో రఘురామకృష్ణమరాజు రిమాండ్‌ను పెండింగ్‌లో ఉంచిన న్యాయమూర్తి ఆయనకు చికిత్స అందించాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు ఎంపీ నిరాకరించడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైకోర్టు హెచ్చరిక
కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టారంటూ... ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీ కాళ్లకు గాయాలయ్యాయని .. పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆధారాలు సమర్పించారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొట్టారని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎంపీ రఘురామ గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రఘురామ కేసు విచారణకు హైకోర్టు స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటైంది.