హైదరాబాద్ నగర శివారు జల్‌పల్లిలోని పెద్దచెరువులో పడి ఓ యువకుడు మృతి చెందగా.. అతని మృతదేహాన్ని గాలించడానికి చెరువులోకి దిగిన మరో యువకుడు గల్లంతైన ఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి కథనం ప్రకారం పాతబస్తీ రెయిన్ బజార్‌కు చెందిన వహీద్ కుమారుడు మొహ్మద్ సొహెల్ (30) ప్రైవేటు ఉద్యోగి. ఖురాన్‌లోని కొన్ని పత్రాలను చెరువులో కలిపేందుకు సొహెల్ శనివారం అర్ధరాత్రి సమయంలో మిత్రుడితో కలిసి జల్‌పల్లి పెద్దచెరువు వద్దకు వచ్చాడు. చీకట్లో కట్టపై నుంచి జారి అదే చెరువులో పడి గల్లంతయ్యాడు.
చాలాసేపటి వరకు సొహెల్ జాడ లేకపోవడంతో వెంట వచ్చిన మిత్రుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చెరువు వద్ద పరిశీలిస్తుండగా.. ఓ యువకుడు బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు. సొహెల్ తనకు బాగా తెలుసని, అతని కోసం తాను గాలిస్తానంటూ చొక్కా విప్పి చెరువులోకి దిగాడు. కొంతసేపటికి అతనూ కనిపించలేదు.
9 గంటల వ్యవధిలో ఇద్దరు గల్లంతు కావడంతో పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, బాలాపూర్ తహసీల్దారు శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ శంకర్ చెరువు వద్దకు చేరుకొని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం సొహెల్ మృతదేహం లభించింది. గల్లంతైన యువకుడు చాంద్రాయణగుట్ట వాసి మహ్మద్ అస్లాంగా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఇవీ చూడండి: పిల్లల అల్లరికి అడ్డుకట్ట వేయడమెలా?