Shivaratri in Srisailam: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో నంది వాహనసేవ కన్నులపండువగా జరిగింది. స్వామి అమ్మవార్లను పుర వీధుల్లో ఊరేగించారు. అనంతరం పాగాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ చేశారు. స్వామివారి కల్యాణం కోసం పాగాలంకరణ చేయటం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం భ్రమరాంబ మల్లికార్జునుల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మహా శివరాత్రి పర్వదినాన శ్రీశైలం ఆలయం.. భక్తులతో కిటకిటలాడింది. అర్ధరాత్రి స్వామి, అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ చేశారు. లక్షలాది భక్తుల ఓంకార నాదంతో శ్రీశైల గిరులు ప్రతిధ్వనించాయి.
కన్నుల పండువగా శివయ్య కల్యాణం..
కర్నూలు జిల్లా మహానందీశ్వర స్వామి కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలను సమర్పించింది. మహనందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి దేవి అమ్మవార్లకు సింహ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి వేళ నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది.
త్రికూట పర్వతంపై..
అశేష భక్తజన సందోహంతో గుంటూరు జిల్లా కోటప్పకొండ నిండిపోయింది. కోరిన కోర్కెలు తీర్చే కోటయ్య కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి మెుక్కులు తీర్చుకున్నారు. శివజాగరణ చేసే భక్తుల శివనామ స్మరణతో త్రికూట పర్వతం మార్మోగింది. భారీ విద్యుత్ ప్రభలు ఉత్సవాలకు మరింత శోభ తెచ్చాయి. గుంటూరు జిల్లా అమరేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ శివనామస్మరణతో.. జాగరణ చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కడపలో బ్రహ్మకుమారీలు ద్వాదశ జ్యోతిర్లింగం ఏర్పాటుచేశారు. రాజంపేటలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహాశివలింగం ఏర్పాటు చేశారు. విశాఖ ఆర్కే బీచ్‌లో మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి కోటిలింగాలకు కుంభాభిషేకం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని రామేశ్వరాలయంలో రామేశ్వరుడి రథోత్సవం వైభవంగా సాగింది. రాష్ట్రంలోని అన్ని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
ఇదీచూడండి: శివోహం.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు...