Ganesha idols: గణపతి పండగ వచ్చిందంటేనే విగ్రహాల తయారీ కళాకారుల ప్రతిభకు చిహ్నంగా ఉంటుంది. అలాంటి సృజనాత్మకతో రూపొందించిన విగ్రహమే ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మెయిన్ బజారులో స్వర్ణలక్ష్మి మహాగణపతిగా కోలువుతీరాడు. నిర్వాహకులు కోల్‌కతాకు చెందిన కళాకారులతో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఈ ప్రతిమను తయారు చేయించారు. తంజావూరు, తిరుపతికి చెందిన కళాకారులు బంగారపు పూతతో ఉన్న లక్ష లక్ష్మీ కాసులతో ప్రతిమకు అలంకరణ చేశారు. కెంపులు, పచ్చలు, అమెరికన్ వజ్రాలూ అలంకరణకు ఉపయోగించినట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ పొట్టి రత్నబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన విభిన్న గణపతులు:
బాపట్ల జిల్లా కళాకారుడు వివిధ పదార్ధాలతో గణనాథుని కళాకృతులు తయారు చేసి భక్తిని ప్రదర్శించారు. సజ్జావారి పాలెంకు చెందిన వల్లభనేని సత్య సాయిబాబు నిత్యం వినియోగించే కూరగాయలు, బాదం, ఉల్లిపాయలు, జీడిపప్పు, వెల్లుల్లిలతో బొజ్జ గణపయ్యను తయారు చేశారు. వివిధ రకాల వినాయకుడి కళాకృతులు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పాతబస్తీలో వినాయక చవితి సందర్భంగా 10 వేల కూల్డ్రింకు సీసాలతో ఏర్పాటు చేసిన 16 అడుగుల గణపయ్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉమాపతి సేవాసమితి 56వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్నంగా తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అనంతపురం జిల్లా కొట్టువారిపల్లికి చెందిన గణేశ్ రాయల్ అనే విద్యార్థి న్యూస్‌పేపరు, మైదాపిండితో 16 అడుగుల అందమైన వినాయక ప్రతిమను తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం రెండు నెలలు శ్రమించాడు. గణేశ్ తయారు చేసిన ప్రతిమనే గ్రామంలోని వినాయక మండపంలో ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. జొజ్జ వెంకటరమణ, మలేశ్వరి దంపతుల కుమారుడు గణేశ్ మదనపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో వినాయక చవితి పురస్కరించుకుని యాచవరానికి కళాకారుడు ఆలూరు రాముఆచారి కొయ్యతో అతి సూక్ష్మ గణేశుడి ప్రతిమను తయారు చేశాడు. చేతిగోరుపై నిలిచే విధంగా కొయ్యతో 0.7 సెం.మీ. పొడవు ఉన్న సూక్ష్మ వినాయకున్ని రూపొందించాడు.
విజయనగరంలోని బాలాజీ కూడలిలో వినాయకుడి విగ్రహాన్ని వేరుశనగలలో తీర్చిదిద్దారు. ఏకంగా 50 కిలోల వేరుశనగ కాయలతో గణనాథుని విగ్రహం కొలవుదీరింది.
విశాఖలో పర్యావరణహిత విఘ్నేశ్వరుడిని తయారు చేశారు. అక్కయ్యపాలెంలో ఓ గృహంలో పర్యావరణానికి మేలు చేసే రీతిలో పసుపు ముద్దతో వినాయకుని ప్రతిమను రూపొందించారు.
ఇవీ చదవండి: