ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలకు, కల్చరల్ ఈవెంట్లకు హైదరాబాద్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్‌లోని సువిశాల ప్రాంగణంలో 2003లో ఏర్పాటై.. మెట్రోపాలిటన్ నగరంగా విరాజిల్లుతోన్న హైదరాబాద్ శిఖలో హైటెక్స్ ఓ కలికితురాయిగా మారింది. దేశంలో హైదరాబాద్ సెంట్రల్లీ లొకేట్ అయి ఉండటం, రోడ్డు, రైలు, వాయు రవాణా మార్గాల అనుసంధానం, నగర సంస్కృతి, చారిత్రక నేపథ్యం, చక్కని వాతావరణంతో ప్రపంచంలోని అత్యత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు సంపాదించుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు, వ్యాపార కార్యకలాపాలకు ఓ వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ ఫెసిలిటీ అవసరమని హైటెక్స్‌ని అందుబాటులోకి తీసుకువచ్చారు. హైటెక్స్ చుట్టుపక్కలే హెచ్ఐసీసీ, వెస్టిన్, నోవాటెల్, ట్రెడెంట్, ఆవాసా, రాడిసన్ వంటి ఐదు నక్షత్రాల హోటళ్ల అనుసంధానం.. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులకు, వ్యాపార వర్గాలకు సౌకర్యవంతంగా ఉండటం ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఈవెంట్స్ జరుపుకోవటానికి దోహదపడుతున్నాయి.
అనేక ఈవెంట్లకు వేదిక
సువిశాల ప్రాంగణంలో ఇండోర్, అవుట్ డోర్ హాళ్లు, అందుకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ సర్వీసుతో అత్యత్తమ డెస్టినేషన్ కేంద్రంగా హైటెక్స్ గుర్తింపు పొందింది. ఏటా వందకు పైగా బీటూబీ, బీటూసీ, బీటూజీ ఈవెంట్లకు హైటెక్స్ వేదికైంది. మీటింగ్స్, ట్రేడ్ ఫెయిర్స్, కల్చరల్ ఈవెంట్స్, ల్యాబ్సైన్స్, రినవబుల్ ఎనర్జీ వంటి లార్జ్ గాదరింగ్ ఎక్స్ పోలతో హైదరాబాద్ హైటెక్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలకు హైటెక్స్ వేదిక కావటంతో వ్యాపార వర్గాలు, అతిరథమహారథులు హైటెక్స్‌కు క్యూ కట్టారు. పెటెక్స్ ఇండియా, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్, పౌల్ట్రీ ఇండియా, అగ్రి ప్రొడక్ట్స్ ఎక్స్పోలకు హైదరాబాద్ హైటెక్స్ రెగులర్ డెస్టినేషన్‌గా మారిపోయింది. అంతటి ఘన వైభవం కలిగిన హైదరాబాద్ హైటెక్స్ కొవిడ్ మహమ్మారి కారణంగా మూతపడి వైభవం కోల్పోయి... ప్రాంగణమంతా వెలవెలబోతోంది.
ఒక్క ఈవెంట్‌కు నోచుకోలేదు
ఏటా వందకుపైగా ఈవెంట్స్‌ను నిర్వహించే హైటెక్స్ ప్రాంగణం.. లాక్డౌన్ విధింపు నుంచి ఒక్క ఈవెంట్ నిర్వహణకు నోచుకోలేదు. కరోనా విజృంభణ ఆంక్షలతో.. బుక్ చేసుకున్న ఈవెంట్స్ సైతం వాయిదా, మరికొన్ని రద్దయ్యాయి. ఈవెంట్స్ జరగకపోవటంతో... నిర్వహణపై ఆధారపడిన అనేక మంది జీవనోపాధికి గండిపడిందని హైటెక్స్ జనరల్ మేనేజర్ సంబిద్ ముండ్ అన్నారు. ప్రస్తుత సీజన్లో ఎక్కువగా ఈవెంట్స్, ఎక్స్‌పోలు జరిగేవని.. కొవిడ్ విజృంభణ తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని సంబిత్ చెప్పారు. నంబర్ ఆఫ్ ఎక్స్బిషన్స్ నిర్వహణతో దేశంలోనే హైదరాబాద్ హైటెక్స్ టాప్-3 ప్లేస్‌లో ఉందని.. ప్రస్తుతం నిర్మిస్తోన్న నాలుగో ఇండోర్ హాల్ దేశంలోనే అతిపెద్ద ఆక్యుపెన్సీ హాలుగా నిలుస్తుందని సంబిత్ పేర్కొన్నారు. దీనిని పూర్తి స్థాయి సాంకేతికతతో నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలకు అనుమతులు లభిస్తోన్న నేపథ్యంలో... కొవిడ్ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులతో తాము సైతం హెటెక్స్ను సెప్టెంబర్ రెండో వారం నుంచి తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంబిత్ వెల్లడించారు.
ఇదీ చూడండి : మీడియా హక్కులు, పరిధిపై విస్తృత విచారణ అవసరం: హైకోర్టు