రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజలు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరిస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా దుకాణాలన్నీ మూసివేసి లాక్డౌన్ పాటించడం ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్, కొత్తపేట, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, నేరేడ్మెట్, కుషాయిగూడ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును సీపీ స్వయంగా పరిశీలించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపు ఉండటం వల్ల... ఆ సమయంలోనే ప్రజలు బయటికి వచ్చి తమకు కావల్సిన అవసరాలు తీర్చుకోవాలని సూచించారు.
లాక్డౌన్ సమయంలో బయటికి వస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. టీకా కోసం వెళ్లే వారు ఆధార్‌కార్డు, మొదటి డోసు సర్టిఫికేట్ లేదా సెల్ఫోన్లో మెసేజ్‌లను చూపించాలని విజ్ఞప్తి చేశారు. 46 చెక్‌పోస్టులు పెట్టి లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు ఉచిత అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మరోవైపు దుకాణాదారులు నిర్ణీత సమయంలోనే తమ వ్యాపారాలను మూసివేసి లాక్డౌన్ పాటించగా... పలు చోట్ల రహదారులపై వాహనాలు రాకపోకలు కొనసాగాయి. చిరువ్యాపారులు ఉదయం రెండు గంటలు మాత్రమే అమ్మకాలు నిర్వహించి ఆ తర్వాత దుకాణాలను మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల తర్వాత నగరంలో అడుగుపెట్టిన ప్రయాణికులు వాహనాలు దొరకక ఇబ్బందులుపడ్డారు. పలు చోట్ల పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. అత్యవసరం లేకుండా రహదారులపై వస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు.