LOAN APPS: అధిక వడ్డీలతో రుణాలు-ఆపై చెల్లించమని వేధింపులు.. కొంత మొత్తంలో పెట్టుబడి అధికమొత్తంలో లాభాలంటూ... ఎంతో మందిని బలి తీసుకున్న రుణయాప్ సంస్థలు హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో తిష్ట వేసేందుకు కుట్ర పన్నుతున్నాయి. యాప్‌లు నిర్వహిస్తున్న చైనా సంస్థలు... నగరంలో కాల్‌సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి.
కీలక సమాచారం..
పలు నేరాలకు సంబంధించి రాచకొండ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో ఇందుకు సంబంధించి కీలక సమాచారం దొరికింది. పోలీసులకు చిక్కిన ముగ్గురు నేపాలీలను విచారించగా కాల్‌సెంటర్ విషయం బయటపడింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా పలు ప్రధాన నగరాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
క్రిప్టో కరెన్సీ రూపంలో చైనాకు..
చైనీయుల ఆధ్వర్యంలోనే రుణ యాప్ సంస్థలకు పెట్టుబడులు, మోసాలు జరుగుతున్నాయి. కాల్‌సెంటర్లు, నకిలీ సంస్థలు, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు స్థానికంగా ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు. ప్రతి నెల 12 నుంచి 15 వేల జీతం... కమీషన్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టిన వ్యక్తులకు వారు నిర్వర్తించాల్సిన విధులను జూమ్‌యాప్ ద్వారా వివరిస్తున్నారు. కొందరికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తున్నారు. వ్యాపార సంస్థలు, బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు అవసరమైన నకిలీ పత్రాలనూ చైనీయులే సమకూర్చుతున్నట్లు సమాచారం. అవసరమైనప్పుడు ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేసి... క్రిప్టో కరెన్సీ రూపంలో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో ప్రజలు సైబర్ ఉచ్చుకు చిక్కొద్దని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు.
ఇదీచూడండి: