New Presidents for YSRCP affiliate unions: ఏపీలో వైకాపా అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షుల్ని నియమిస్తూ అధికార పార్టీ కొత్త జాబితను విడుదల చేసింది. మంత్రి రోజా, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మరికొంత మందికి ఈ జాబితాలో అవకాశం దక్కలేదు. మహిళా విభాగం బాధ్యత నుంచి రోజాను తప్పించి గతేడాది తెదేపా నుంచి వైకాపాలో చేరి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీతకు అప్పగించారు. యువజన విభాగం అధ్యక్ష బాధ్యత నుంచి రాజాను తొలగించి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డికి కేటాయించారు.
ఎస్టీ విభాగాన్ని.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నుంచి తీసేశారు. ఈ విభాగాన్ని కొండప్రాంతం, మైదాన ప్రాంతమని రెండుగా చేసి వెంకటలక్ష్మి, ఎం.హనుమంత నాయకులకు అప్పగించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా ఉన్న ప్రసాదరాజును తొలగించి ఆ పదవిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఇచ్చారు.
సేవాదళ్ అధ్యక్ష పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తప్పించి.. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ ఎండీ రుహల్లాకు కట్టబెట్టారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి, శివభారత్ రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో శివభారత్ రెడ్డిని డాక్టర్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: నేడు హైదరాబాద్‌కు 30 మంది భాజపా ప్రతినిధులు
'మహా' సంక్షోభం: గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ.. సుప్రీంకు శివసేన