బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కరోనా ప్రభావం కారణంగా నిర్ణీత షెడ్యూలు కంటే ముందే సమావేశాలను ముగించారు. ఈ నెల 6న ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 8న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌పై సాధారణ చర్చతో పాటు అన్ని పద్దులపైనా చర్చ పూర్తైంది.
సమావేశాల చివరి రోజైన ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లు సహా ఆరు బిల్లులను ఆమోదించారు. రెండు తీర్మానాలను అసెంబ్లీ ఆమోదించింది. పట్టణప్రగతి, కరోనా అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. 48 గంటలా 41 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
సభావ్యవహారాల సలహాసంఘం సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈ నెల 20 వరకు సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఉత్పన్నమైన పరిస్థితుల్లో నాలుగు రోజుల ముందుగానే సమావేశాలను ముగించారు.