వికారాబాద్ జిల్లాలో సేత్వార్ ఆధారంగానే ధరణి వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ దస్త్రాలను విస్తీర్ణంతో సహా గతంలో నమోదు చేశారు. ఏయే సర్వే నంబర్లతోనైతే దస్త్రాల్లో అదనపు విస్తీర్ణం నమోదు చేసి ఉందో(పాస్ పుస్తకాల ద్వారా) వాటి మ్యుటేషన్లు ప్రస్తుతం సాధ్యం కావడం లేదు. సాంకేతిక సమస్యలతో భూ యాజమాన్య హక్కుపై సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు భూమి ఉన్నా లేకున్నా పాస్‌పుస్తకాలు ఇవ్వడం, భూమి అమ్మకాలు, కొనుగోళ్లను సక్రమంగా నమోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 800 నుంచి వెయ్యి ఎకరాల భూమి అదనంగా రికార్డుల్లో నమోదైనట్లు తెలుస్తోంది.
ఇకనైనా పరిష్కారం అయ్యేనా?
జిల్లాలోని 18 మండలాలు, 565 గ్రామ పంచాయతీల్లో 4.83 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో 2.26 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారు. నాలుగు రెవెన్యూ డివిజన్లలోనూ వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. భూమి సరిహద్దుల విషయమై ఇబ్బందులు లేకపోయినా, నేటికీ పట్టాలు లేని వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాని భూ సమస్యలు... కొత్త రెవెన్యూ చట్టం ద్వారానైనా పరిష్కారమవుతాయేమోనని ఎదురు చూస్తున్నారు.
ఇంతకాలం...
ఇంతకాలం తహసీల్దార్లు తీసుకున్న నిర్ణయం వల్ల అన్యాయానికి గురైన వారు ఆర్డీఓల వద్దకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించవచ్ఛు పై రెండు స్థాయిల్లో బాధిత రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉండేది. కొత్త విధానంలో అన్యాయం జరిగిందని భావిస్తే బాధిత రైతు నేరుగా న్యాయస్థానానికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల భూ సంబంధ కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి. వాటికి మాత్రమే ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
15 రోజుల్లో ...
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను వచ్చే 15 రోజుల్లో వంద శాతం నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండటంతో, తప్పులు దొర్లే అవకాశం ఉంటుందని పలువురు సీనియర్ అధికారులు, పదవీ విరమణ చేసిన రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఒకసారి జమాబందీ నిర్వహణ అనివార్యమని జిల్లాలో రెవెన్యూ విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఓ అధికారి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఎల్ఆర్ఎస్కి జాప్యం: క్రమబద్ధీకరణకు ‘సాఫ్ట్‌వేర్’ అడ్డంకి!