వరంగల్‌కు కూతవేటు దూరంలో నెలవైన సహజ అటవీ ప్రాంతంపై భూ మాఫియా కన్నుపడింది. తమ స్వార్థం కోసం విలువైన వనసంపదను నరికేసి పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యం కోసం ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లు ఖర్చు చేసి మొక్కలు నాటుతోంది. మియావాకీ పద్ధతిలో దట్టమైన చిట్టడవులు పెంపకానికి అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ఇవేమీ పట్టని కబ్జాకోరులు పోడు నెపంతో అటవీ ప్రాంతాన్ని గుప్పిట్లోకి తీసుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. తొలుత ఏళ్లనాటి చెట్లను కొట్టేసి విద్యుత్ లైన్లను వేశారు. కళ్లముందే అటవీ సంపద తరిగిపోతున్నా అధికారులకు పట్టడం లేదని ఓరుగల్లు వాసులు విమర్శిస్తున్నారు.
అటవీ ప్రాంతమైన ఇనపరాతిగట్టు ప్రాంతంలో ఈ మధ్యనే విద్యుత్ స్తంభాలు వేశారు. హద్దులను దాటి ఇవి ఏర్పాటు చేశారు. అటవీశాఖ వారు వీటిని నిరోధించడం కూడా జరుగుతున్నది. చుట్టూ విలువైన వన సంపద అన్యాక్రాంతమవ్వడం, పోడు జరగడమనేది జరుగుతుంది. కాకపోతే సెక్షన్-4లో రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాల్సి ఉంది. రిజర్వ్ చేసి దానికి చక్కటి బౌండరీలు ఫిక్స్ చేసుకన్నట్లైతే వీలువైన వన సంపదను భావితరాలకు అందించగలం. నేషనల్ పార్కుగా కూడా అభివృద్ధి చేసుకునేంత అవకాశం ఉన్న ప్రాంతం - పురుషోత్తం, విశ్రాంత అటవీ శాఖాధికారి.
ఇనపరాతి గుట్టలు సహజవనరు. అది వరంగల్‌లో ఒక్క శాతం ఉన్న అటవీ ప్రాంతం. కొంత మంది భూకబ్జాదారుల వల్ల అది అన్యాక్రాంతం అవుతోంది. దాన్ని జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం చొరవ తీసుకుని రక్షించాల్సిన అవసరం ఉంది.- వీరభద్రరావు, వన సేవా సోసైటీ అధ్యక్షుడు.
గుట్టుచప్పుడు కాకుండా..
వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు ప్రాంతంలో కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సర్వే నెంబర్లను ఏమార్చి కబ్జాపర్వానికి తెరలేపారు. విద్యుత్ శాఖ లైన్లకు మంజూరు ఇవ్వడంపై పర్యావరణ నిపుణులు మండిపడుతున్నారు. అటవీ అధికారుల ఫిర్యాదుతో విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపివేసినప్పటికీ... రాత్రికి రాత్రే విద్యుత్ నియంత్రికను ఏర్పాటు చేసుకుని సరఫరా పునరుద్ధరించుకున్నారు.
ఉనికే ప్రశ్నార్ధకం..
వేలేరు, ధర్మసాగర్, భీమదేవపల్లి మండలాల పరిధిలో నిజాం కాలం నుంచి 4వేలకు పైగా ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పెద్ద వృక్షాలు, విలువైన ఔషధ మొక్కలతో పాటు అరుదైన వన్యప్రాణులకు ఇనుపరాతి గుట్టలు నెలవు. ట్రక్కింగ్ పాయింట్‌గా కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కబ్జా కోరల్లో చిక్కుకుంటే వాటి ఉనికే ప్రశ్నార్ధకమవుతోందని వన ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.
అటవీ భూముల్లో దర్జాగా అక్రమ మైనింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. హద్దులు గుర్తించి ఇనుపరాతి గుట్టలను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో త్వరలో 'తెలంగాణ దళిత బంధు' పథకం అమలు