హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో అదొకటి. అక్కడ ఉద్యానం అభివృద్ధికి ఖాళీగా వదిలిన స్థలంపై ఓ ప్రజాప్రతినిధి కన్నేశారు. స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చేయడమే కాదు.. కబ్జాను అడ్డుకునేందుకు వచ్చిన వారిని బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఖరీదైన 25 ఎకరాల భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. అందులో 3.5 ఎకరాల భూమిని చదును చేసి లేఅవుట్ వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు. 2009లో అప్పటి ప్రభుత్వం రాక్‌గార్డెన్ పేరుతో పార్కు అభివృద్ధికి కేటాయించిన ఈ భూమిని చేజిక్కించుకునేందుకు ఓ ప్రజాప్రతినిధి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన ప్రయత్నాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తాజాగా ప్రజాప్రతినిధి వర్గం దూకుడు పెంచింది. అడ్డుకోబోయిన వారిని బెదిరించడం, అడ్డుగా ఉన్న పార్కు ప్రహరీని కూల్చడంతో అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.
పత్రాలను సృష్టించి.. " ఫిల్మ్‌నగర్ పరిధిలోని 102, 403 సర్వే నంబర్లలోని 1,300 ఎకరాలను గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి ఇచ్చింది. రాక్ గార్డెన్ కోసం కేటాయించిన భూమి అందులోనిదే. మొదట్లో అక్కడ 30 ఎకరాల ఖాళీ స్థలం ఉండేది. ఆక్రమణలతో 25 ఎకరాలకు తగ్గినట్లు అంచనా. మిగిలిన భూమి చుట్టూ జీహెచ్‌ఎంసీ ప్రహరీ నిర్మించింది. అక్కడ పార్కు నిర్మాణ పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు పలుమార్లు వెళ్లారు. వారిని ప్రజాప్రతినిధి మనుషులు అడ్డుకునేవారు. ఆ భూమి వక్ఫ్ బోర్డుదంటూ పత్రాలు సైతం రూపొందించారు. వాటిని రెవెన్యూ అధికారులు న్యాయస్థానంలో సవాలు చేశారు. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ.. ఫిల్మ్‌నగర్ భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు.. అక్కడ పార్కు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. విశాలమైన ఈ భూమిలో భారీ బండరాళ్లు, ఎత్తైన గుట్టలు, వాటి మధ్య రెండు అందమైన నీటి కుంటలు ఉన్నాయి. అక్కడ రాక్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారుతుంది. అందుకు జీహెచ్‌ఎంసీ సాహసం చేయలేకపోతోంది. అదే అదనుగా.. బల్దియా నిర్మించిన గోడను కూల్చిన ఆక్రమణదారు 3.5 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఇంటి స్థలాల పేరిట ప్రజాప్రతినిధి బినామీ 40 ప్లాట్లను విక్రయించారు. దీన్ని అడ్డుకోకపోతే.. నెల రోజుల్లోపే పార్కులో కాలనీ వెలుస్తుంది. తర్వాత.. రాక్‌గార్డెన్ భూమి కనుమరుగవుతుంది" అని స్థానిక రెవెన్యూ సిబ్బంది 'ఈనాడు'కు తెలిపారు.
ఆక్రమణదారులు హెచ్‌ఎండీఏ, ప్రభుత్వ భూములను అనేక ప్రాంతాల్లో కబ్జా చేశారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే కార్వాన్ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని ఖాళీ స్థలాల ఆక్రమణకు అడ్డుకట్ట పడుతుందని ఫిల్మ్‌నగర్ డివిజన్ రెవెన్యూ యంత్రాంగం పేర్కొంటోంది. విలువైన స్థలం కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.
ఇదీ చూడండి: భూ వివాదం.. గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు
ఐదు నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య.. అసలేమైంది?!