Hyderabad Pharma City : హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో ఫార్మా సిటీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా భూమిని సేకరించి అధికారికంగా ఔషధ నగరిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం 10,200 ఎకరాల పట్టా భూములు, 9,133 ఎకరాల ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 19,333 ఎకరాలు కావాల్సి ఉండగా ఇప్పటికే కందుకూరు, యాచారం మండలాల్లో 13వేల ఎకరాల సేకరణ పూర్తయ్యింది.
Pharma City in Hyderabad : యాచారం మండలంలో కొందరు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అప్పగించినా, మరికొందరు భూసేకరణను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ మండలంలోని కుర్మిద్ద, మేడిపల్లిల్లో 1800 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కోర్టు కేసుల్లో నలుగుతున్న భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ.153 కోట్ల పరిహారాన్ని నేరుగా ప్రత్యేక న్యాయ అథారిటీలో జమచేసి భూసేకరణకు అనుమతించాలని అధికారులు అథారిటీని కోరారు. దీంతో చట్టపరంగా సమస్య పరిష్కారమైనట్టేనని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ‘చట్టబద్ధంగా రైతులకు చెల్లించాల్సిన పరిహారం నేరుగా అథారిటీలో జమ చేశాం. భూసేకరణ మార్గం సుగమం కానుంది’’ అని ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి వివరించారు.
చురుగ్గా పనులు
Pharma City in Telangana : ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడి, తయారీ ప్రాంతం (నిమ్జ్) హోదా కల్పించింది. మరి కొన్నేళ్లలో రూ.64వేల కోట్ల పెట్టుబడుల సాధనతో పాటు, 5.60 లక్షల మందికి ఉపాధి కల్పించే సత్తా ఫార్మా సిటీకి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4,922 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. వచ్చే బడ్జెట్‌లో రూ.870 కోట్లు కేటాయించాలని ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో టీఎస్‌ఐఐసీ తరఫున మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రహదారుల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సమీపంలో భారీ విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన భూసేకరణ పూర్తి చేసి టీఎస్‌ఐఐసీకి అప్పగిస్తే వసతుల కల్పన చేపట్టనున్నారు.