హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ఈ ఏడు నగర వాసులు ఇంటి వద్దే నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలతో రెండు రోజుల పాటు పాతబస్తీలోని అన్ని పురాతన ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం నిలిపివేశారు. అక్కన్న మాదన్న, దర్బార్ మైసమ్మ, బెల్లా ముత్యాలమ్మ, బాగ్యాలక్ష్మీ అమ్మవారి ఆలయంతోపాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో ఉదయం అభిషేకాలతో పూజలు మొదలయ్యాయి. ఈ ఆలయాల్లో కేవలం ఆలయ కమిటీ సభ్యులే బోనాలు సమర్పించారు. భక్తులు ఎవరికీ ప్రవేశం కల్పించలేదు. మీర్ఆలం మండి మహాంకాళీ అమ్మవారి ఆలయంలో కూడా 27 రోజులుగా జరుగుతున్న ఛండీయాగం ఆదివారంతో ముగిసింది. ఉప్పుగూడ నుంచి అమ్మవారి ఆలయం మీదుగా మీర్ఆలం మండికి బంగారు బోనం సమర్పించారు.
ఈ ఏడు నగరంలో బోనాల ఉత్సవాలు నిరాడంబరంగా కొనసాగాయి. ఆలయ పూజారులు బలిహారణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రంగురంగుల పూలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. భక్తులు రాకుండా నాగులచింత, ఓల్డ్ ఛత్రినాక, గౌలిపురా నుంచి లాల్ దర్వాజాకు రోడ్లు మూసివేశారు. ఇవాళ ఉదయం రంగం, బలిగంప, పోతురాజుల ఊరేగింపు జరగనుంది. అక్కన్న మాదన్న నుంచి అంబారీపై అమ్మవారి ఊరేగింపుతో కార్యక్రమం పూర్తికానుంది.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు