Lady Fell in Rain Water: సికింద్రాబాద్ అల్వాల్ సర్కిల్ పరిధిలో కురుస్తున్న వర్షంతో రహదారులు చెరువులయ్యాయి. సుమారు గంటకు పైగా కురిసిన వర్షంతో.. ఎక్కడ ఏ గుంత ఉందో..? ఏ స్పీడ్ బ్రేకర్ ఉందో..? తెలియనంతగా.. రహదారులు నీటిమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నడిచేందుకు కూడా వీలులేకపోవటంతో.. పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారుల పరిస్థితి చెప్పనవసరమే లేదు.
అయితే.. మచ్చబొల్లారంలోని అంజనీపూరి కాలనీలో వరద నీటితో రహదారి నిండిపోయింది. అదే సమయంలో.. మంజుల అనే మహిళ అటుగా నడుచుకుంటూ వెళ్లింది. చాలా జాగ్రత్తగా.. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. నీటితో పూర్తిగా నిండిపోయిన రహదారిపై ఎక్కడ ఏముందో కనిపించకపోవటంతో ఆ మహిళ ప్రమాదవశాత్తు ఓ గుంతలో పడిపోయింది. అది ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతి కావటంతో.. మహిళ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో అక్కడున్న స్థానికులు.. మహిళ పడిపోవటాన్ని గ్రహించి వెంటనే ఆమెను పైకి లేపి రక్షించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
సికింద్రాబాద్లోని చిలకలగూడ, బోయిన్పల్లి, మారేడ్పల్లి, ప్యాట్నీ, ప్యారడైస్, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాలలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి.. చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు.. ఆ రోడ్ల వెంట వెళ్లేందుకు జంకుతున్నారు.
ఇవీ చూడండి: