ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో జల విప్లవం వస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆహారశుద్ధి, లాజిస్టిక్స్ పాలసీలపై ప్రగతి భవన్‌లో మంత్రుల సమావేశం జరిగింది. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమన్వయంలో నిర్వహించిన భేటీకి... మంత్రులు, సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సహా అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, దానివల్ల ఆహారశుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాలపై కేటీఆర్ వివరించారు. జలవిప్లవం తోడ్పాటు వల్ల పాడి, మత్స్య, మాంసం, పాల ఉత్పత్తి పరిశ్రమల్లోనూ కొత్త ఒరవడులు రానున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో గొర్రెలు, చేప పిల్లల పెంపకం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో... ఏ పంటలు పండుతున్నాయనేది పూర్తిగా మ్యాపింగ్ చేశామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా శుద్ధి చేసే సామర్థ్యం మనకు లేదన్న కేటీఆర్... నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయని స్పష్టం చేశారు. అందువల్ల వెంటనే ఆహారశుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా రైతుకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆహారశుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.