KTR About Municipality Annual Report: వచ్చే సంక్రాంతి నాటికి హైదరాబాద్ వందశాతం మురుగునీటి శుద్ధీకరణ నగరంగా మారబోతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2021-22 ఏడాదికి సంబంధించి పురపాలకశాఖ వార్షిక నివేదిక కేటీఆర్ విడుదల చేశారు. గడచిన ఏడాది కాలంలో హైదరాబాద్ సహా పట్టణప్రాంతాల్లో మౌలికవసతులు, పౌరసేవల మెరుగుదల, ప్రణాళికాబద్ధ అభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో వరద ముంపును తగ్గించేందుకు వేగంగా పనులు చేస్తున్నామని వివరించారు. ఐతే ఈసారి ముంపు పూర్తిగా తొలగిపోతుందని హామీ ఇవ్వలేనని స్పష్టంచేశారు. వైకుంఠదామాలు, వెజ్-నాన్‌వెజ్ మార్కెట్, డంపింగ్ యార్డులో బయో మైనింగ్ వంటి 10 పనులను ప్రతి మున్సిపాలిటీలో లక్ష్యంగా పెట్టుకుని.... ఏడాది కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. పురపాలకల శాఖలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇంజినీర్ల వరకూ ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పురపాలక శాఖ పనితీరుకు కేంద్రం అందిస్తున్న అవార్డులే నిదర్శమని తెలిపారు. అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా లెక్కగట్టకుండా పట్టణప్రాంత జనాభా అధికంగా ఉన్న తెలంగాణకు ఎక్కువ స్మార్ట్ సిటీలు మంజూరు చేయాలని.. అందుకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"హైదరాబాద్ శివారులో ముంపు సమస్యను అధిగమించేందుకు చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యాక్రమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తాం. అన్ని పట్టణాల్లో పది నిర్దేశిత కార్యక్రమాలను ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పంచాయతీ కార్యదర్శుల తరహాలో వార్డు ఆఫీసర్లను నియమిస్తాం. ఈ ఏడాది ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా అన్నింటినీ భర్తీ చేయనున్నాం. హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాలను సమస్యలు లేకుండా చూడాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. పురపాలకశాఖలో ఎంత బాగా పనిచేసినా సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటిని మీడియా భూతద్దంలో కాకుండా సానుకూల దృక్పథంతో చూడాలి. 2050 నాటికి దేశంలోని 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుందని నీతిఆయోగ్ అంచనా. కానీ.. తెలంగాణలో మాత్రం 2025కే ఆ పరిస్థితి వస్తుంది. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా ఇండెక్సుల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌ను కేవలం దేశంలోని ఇతర నగరాలతో కాకుండా ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో ఉంచాలన్న లక్ష్యంతో ఉన్నాం. 3800 కోట్లతో కడుతున్న ఎస్టీపీల ద్వారా.. వచ్చే సంక్రాంతి వరకు వందశాతం మురుగునీరుశుద్ధి చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది. పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణను కేంద్రం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది." - కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి
ఇవీ చూడండి: