జీహెచ్ఎంసీలో నూతన పురపాలక చట్టంపై రెండు రోజులుగా పురపాలక శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. పురపాలక చట్టంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులు, నిబంధనలపైన గత రెండు రోజులుగా టౌన్ ప్లానింగ్, రాబడులు, పాలన సంస్కరణలు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.
పరిపాలనా ఫలాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత మెరుగ్గా ప్రజలకు అందించేందుకు మున్సిపల్ కమిషనర్లు పనిచేయాలని మంత్రి కేటీఆర్ నిర్దేశించారు. వారం రోజుల్లో మున్సిపల్ కమిషనర్లు తమ సిబ్బందితో నూతన పురపాలక చట్టంపై సమావేశాన్ని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, సూర్యాపేట, పీర్జాదీగూడా మున్సిపాలిటీలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. మిగిలిన వారు ఆయా పురపాలికల పరితీరును పరిశీలించాలని కమిషనర్లను కోరారు. ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్రస్థాయిలో మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉత్తమ సేవలు అందించిన పురపాలక కమిషనర్లకు పురస్కారాలు అందించారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రానికి వెలుగులు పంచిన ఘనత కేసీఆర్‌దే'