KTR Comments on Amit Shah Speech తెలంగాణ ఆత్మ గౌరవం, ఇక్కడి ప్రజల ఆకాంక్షలు... దిల్లీ బాదూషాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న విషయం.. మునుగోడులో అమిత్‌షా ప్రసంగంతో మరోసారి రుజువైందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమిత్ షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం లేదన్నారు. నల్ల చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న భాజపా నేతలు... రైతు పక్షపాతి అయిన కేసీఆర్‌ను విమర్శించడాన్ని చూసి.. హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. భాజపా ప్రభుత్వం విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు. కేసీఆర్ వేసిన ప్రశ్నలకు.. జవాబు చెప్పకుండా అమిత్‌షా దాటవేశారని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్‌గా అమలుచేస్తున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. నల్ల చట్టాలతో 13 నెలలపాటు రైతులను వేధించి... వారి ప్రాణాలను బలిగొన్న ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న అమిత్ షా.. తెలంగాణ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. లఖీంపూర్‌లో రైతుల నెత్తురు కళ్ల చూసిన వారికి.. రైతులపై మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించిన అమిత్‌షా.... ఆ పథకం నుంచి గుజరాత్ ఎందుకు వైదొలిగిందో మునుగోడులో చెప్తే బాగుండేదని కేటీఆర్ అన్నారు. ఫసల్ బీమాతో …ఇన్సురెన్స్ కంపెనీలకు 40వేల కోట్ల లాభం రావడమే తప్ప.. రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు.
వేల కోట్ల కాంట్రాక్టులతో ఎమ్మెల్యేను కొన్న భాజపా... మునుగోడుకు కోట్లాది రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తుందని అంతా ఆశించారన్న కేటీఆర్... గోల్‌మాల్ గుజరాత్‌కు తప్ప.. గోల్డ్ మోడల్ తెలంగాణకు రూపాయి ఇచ్చే సంస్కారం ఆ పార్టీకి లేదన్నారు. ఆత్మాభిమానంలేని కొందరు అమిత్ షా చెప్పులు మోయొచ్చుగానీ.. తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్న కుట్రలకు... ఆత్మగౌరవమున్న తెలంగాణ జాతి ఎప్పుడూ లొంగదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కిలో దొడ్డు బియ్యాన్ని కొంటామంటున్న అమిత్‌షా... ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ పార్టీనే అన్న విషయాన్ని మర్చిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా రాజకీయం చేయడం... బోర్డులు పెట్టి పెత్తనం చేయడం నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని ప్రతీ రంగాన్ని భష్టుపట్టిస్తున్న మోదీ ప్రభుత్వం... నేతన్నలకు తీరని అన్యాయం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. అమిత్ షా ప్రసంగం నిరుత్సాహానికి గురి చేసిందని... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఏనాటికీ అర్థం చేసుకోలేరని రుజువైందన్నారు.
ఇవీ చదవండి: