ఫర్టిలైజర్స్ మాఫియా.. రైతులను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతోంది. ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని ఎరువుల దుకాణాలను ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ఆగడాలు ఆగడం లేదు. అసలే ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టంతో అల్లాడిపోతున్న రైతులకు పెరిగిన పెట్టుబడులు నెత్తిన కుంపటిలా మారాయి. ప్రభుత్వం చెప్పిన ధరకంటే అధిక ధరకు విక్రయిస్తూ వారిని ఆర్థిక కష్టాలకు గురిచేస్తున్నారు. అలాంటి ఎరువుల దుకాణాలపై పంజా విసిరారు ఓ సబ్ కలెక్టర్.. మారువేషంలో ఎరువుల దుకాణాలకు వెళ్లి వారికి ముచ్చెమటల పట్టించారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతున్నారనే సమాచారంతో.. జిల్లా కలెక్టర్ జే నివాస్.. చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్.. పలు ఎరువుల దుకాణాల్లో రైతు వేషంలో తనిఖీలు చేపట్టారు. నేత లుంగీ, చిరిగిన చొక్కా, మెడలో తువాలు ధరించి రైతులా పలు షాపులకు వెళ్లారు.
ఎమ్మార్పీ ధరలను మించి
మొదటగా కైకలూరు మండల కేంద్రంలోని వాసవీ ఫెర్టిలైజర్స్‌కు వెళ్లి యూరియా, డీఏపీ ధరలను సబ్ కలెక్టర్ అడిగారు. తమ దగ్గర ఆ ఎరువులు లేవనే సరికి మండలంలోని వెంకటనాగదత్త ఏజెన్సీకి వెళ్లారు. అక్కడ బస్తా యూరియాకు రూ.280, డీఏపీకి రూ.1250 చొప్పున తీసుకున్నారు. అనంతరం తెల్ల పేపరుపై రశీదు రాసి గోడౌన్‌కు వెళ్లి ఎరువులు తీసుకోవాలని షాపు యజమాని సూచించారు. అతను చెప్పిన విధంగానే వెళ్లి ఎరువులను తీసుకుని తిరిగి దుకాణం వద్దకు చేరకున్న సబ్ కలెక్టర్... యూరియా ఎమ్మార్పీ ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ రూ.1200 కాగా రూ.1250కి అమ్ముతున్న తీరును స్వయంగా గుర్తించారు. వెంటనే సహాయ వ్యవసాయ సంచాలకులు, కైకలూరు తహసీల్దార్‌ను పిలిచి గోదామును తనిఖీ చేయించారు. ఆధార్ బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్న రెండు దుకాణాలపై కేసు నమోదు చేయాలని అధికారులను సబ్‌కలెక్టర్ ఆదేశించారు.
మరో చోట
ఇదే విధంగా ముదినేపల్లి మండలం దేవపుడి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణేష్ ట్రేడర్స్‌ను తనిఖీ చేసేందుకు సబ్ కలెక్టర్ వెళ్లగా.. ఆ దుకాణం మూసి ఉంది. దీంతో సంబంధిత షాపును తనిఖీ చేసి డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ చెంద్ ఆదేశించారు. రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: cotton farmers: దళారుల దగా... విత్తన పత్తి రైతులు విలవిల